Sunday, September 30, 2012

వచ్చాడు గణపయ్య..



కొన్ని అనుభవాలు చాలా విచిత్రం గా వుంటాయి.
అవి జరగడానికి కారణాలు అర్థం కావు.
జరిగిన దానికి ఒక విట్నెస్ గా మిగలడం తప్ప...

వినాయక చవితి రోజు..
అసలు పండగ జరపాలా వద్దా అన్న సందేహం
ఉదయం పదింటివరకు.. జస్ట్ అలా టీ తాగి అలా కూర్చున్నాను..
వైజాగ్ నుంచి తను రాలేదు.. పిల్లలు అలానే నిద్ర పోతున్నారు..
వాళ్ళని లేపాలని కూడా అనిపించలేదు
తొమ్మిదింటికి లేచి పిల్లలు ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చున్నారు.

పండగ కదరా ఇంకా అలాగే కూర్చుంటే ఎలా వినాయకుడి ప్రతిమ ఎప్పుడు తెస్తావు అంటే. డాడీ వచ్చాక తెద్దాం లే అంటాదు పెద్దవాదు. అసలు తను బయల్దేరిందీ లేనిదీ కూడా తెలీదు..
ఇంతలో పెద్దాడి ఫోన్ రింగ్ అయ్యింది. తొమ్మిదిన్నరకి స్టేషన్ కి రమ్మని వాళ్ళ డాడీ..

హమ్మయ్య ఒక పని అయ్యింది.. అనుకున్నాను..
పదింటికి వంటా, పూజ పనులు మొదలు పెట్టాను.. అసలే వినాయక చవితి అంటే వంట పని హడావిడి అంతా ఇంతా కాదు.. అయినంత వరకే వెరైటీలు అనుకుని.. సింపుల్ గా ఉండ్రాళ్ళు, పరమాన్నం, వడపప్పు, పాలతాలికలు చేద్దాం అని డిసైడయ్యాను. మంటపం పని పెద్దాడు, చిన్నాడు చూసుకున్నారు.

మొత్తానికి రెండింటికల్లా పూజ అయ్యింది. ఇన్నేళ్ళలో ఇదే ఫాస్టెస్ట్ రికార్డ్ నాకు :)




ఎప్పటిలానే మట్టి ప్రతిమ కి పూజ చేశాము. కానీ చూడటానికి మంచి కళగా అనిపించింది.. పెద్దాడి సెలెక్షన్ :) పూజలో టెంకాయ కొట్టగానే పువ్వు వచ్చింది.. ఓహ్.. గుడ్ శుభం.. అనుకున్నా.. టెంకాయ సెలెక్షన్ నాది అని చిన్నాడి సంబరం. ఎంతైనా వినాయకుడు పిల్లల పార్టీ కదా..





సాయంత్రం కూడా పూజ కానిచ్చాను. కానీ ఎప్పుడు కదిలించాలి అని ప్రశ్న.. బుధవారం పండుగ వచ్చింది, మూడో రోజుకి శుక్రవారం వస్తుంది.. శుక్రవారం వినాయకుడిని కదిలించకూడదని ఒక సెంటిమెంట్.. మరి అయిదో రోజంటే.. ఆదివారం. అమ్మో అన్ని రోజులా.. కళ్ళు గిర్రున తిరిగాయి..కాలేజీ, అక్కడ వర్కూ, ఇంటికి వచ్చి పూజలూ నైవెద్యాలు.. హ్మ్మ్ ఇది కాని పనిలే అని.. అయిష్టంగానే అదే రోజు వినాయకుడిని కదిలించాను.

సాధారణంగా పెరట్లోనే వినాయకుడిని వుంచేసి.. ఆ మట్టి ప్రతిమ మట్టిలో కలిసే దాకా రోజూ ఆ వి
గ్రహం మీద ఒక చెంబుడు నిళ్ళు పోస్తుంటా.. కానీ ఈ సారి ఎందుకో ప్రతి రోజూ మరిచి పోయాను. విగ్రహం అలానే చెక్కు చెదరకుండా పూల కుండీలోంచి తొంగి చూసేది.
అదే కళ..ఈ మధ్యలో రెండు పెద్ద వర్షాలు కూడా పడ్డాయి..
అయినా విగ్రహం చెదర లేదు. మరి యేం చెయ్యాలా అని సందిగ్ధం..

ఎట్టకేలకు నిన్న (29-09-2012)నిమజ్జనం రొజయ్యింది. 
రాత్రంతా వాన కురుస్తూనే వుంది.. పూల మొక్కల వైపు మాత్రం పెద్దగా కురవడం లేదు. వెళ్ళి ఒకసారి చూసి వచ్చాను. వినాయకుడు అలాగే కొలువు తీర్చుకుని వున్నాడు. హ్మ్.. ఇంకా ఎన్నాళ్ళు  పడుతుందో..కనీసం  రేపటి నుండీ మరిచి పోకుండా విగ్రహం మీద   నీళ్ళుపొయ్యాలి అనుకున్నాను.

ఇవేళ ఉదయం పెరటి వైపు తలుపు తీస్తూ అలవాటుగా గోడ వారగా వున్న మొక్కల కుండీల వైపు చూశాను.. ఉలిక్కి పడ్డాను. వచ్చాను వెళ్ళాను అన్నట్టు.. వినాయకుడి విగ్రహం ముచ్చటగా మూడు ముక్కలై వుంది..  ఒకానొక గిల్టీ ఫీలింగ్ తో కూడిన ఆనందమో, ఉలిక్కిపాటో.. ఒక్కసారిగా మనసంతా భావాల రంగులు అలికేసినట్టయ్యింది. 


ఇన్నిరోజులూ నిన్నరాత్రికన్న పెద్ద వర్షాలే పడిన రోజులున్నాయి. వాటికి చెక్కు చేదరని విగ్రహం నిన్నటి సన్న్న జల్లుకి చక్కగ తేటగా నానినట్టున్న మట్టి.. వెళ్ళానన్న వీడ్కోలు... 

వచ్చాడు గణపయ్య..  వెళ్ళాడు బొజ్జ గణపయ్య!




No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...