Monday, April 1, 2024

Soul Vs Ego యుద్ధం పుట్టుపూర్వోత్తరాలు


భగవంతుడిని పోలిన ఆత్మ (Soul) Vs శరీరమును పోలిన అహము (Ego) 

(భగవదంశ అయిన ఆత్మ Vs శరీరాంశమైన ఆత్మ)  


 ఒక సరళమైన విధానమున చెప్పవలెనన్న రాజైన ఆత్మ రాచభవనమునందు వసించు అంతరంగ ప్రదేశములు:-

1. అధిచేతన స్థితి యొక్క సూక్ష్మ స్థావరము (Superconsciousness)

2. కూటస్థ చైతన్యము (Christ Consciousness)

3. విశ్వచైతన్యము (Cosmic Consciousness)

 ఈ స్థావరములు వరుసగా 1. మెడుల్లా, 2. మెదడు ముందుభాగము- రెండు కనుబొమల నడుమ స్థానము (అదియే ఆధ్యాత్మ నేత్ర స్థానము), 3. మెదడు పైభాగము/నడినెత్తిన (ఆత్మ సిమ్హాసనము). అది వేయిదళ పద్మము యందలి స్థానము. ఈ స్థానములకు చెందిన స్థితి నుండి చైతన్యము ప్రవహించి, "ఆత్మ" రాజుగా ఉన్నతమైన పరిపాలనను సాగించును. అనగా మనిషి యందు ఆత్మ భగవంతుని ప్రతిబింబమై యుండును. కానీ ఆత్మ శరీర చైతన్యమునకు దిగి వచ్చినచో అది "మాయ, మరియు అజ్ఞానము" యొక్క ప్రభావమునకు గురగును. అనగా వ్యక్తి భ్రాంతికి, అజ్ఞానమునకు గురగును. ఫలితముగా అహము చైతన్యము (Ego) ఏర్పడును. 

" ఆత్మ" విశ్వమాయకు గురై భ్రాంతికి లోబడినపుడు అది పరిమితమైన "అహము" (Ego) గా మారును. అపుడది శరీరము తోను, శరీరమునకు చెందిన ఇతర విషయములతోను (ఇంద్రియాలతో) తనను పోల్చుకొనును. అహము (Ego) రూపమున ఉన్న ఆత్మ శరీరమునకు ఉన్న పరిమితులు అన్నిటిని తనకు ఆపాదించుకొనును. ఆ విధముగా శరీరముతో తనను పోల్చుకొనెడి ఆత్మ, తన సర్వవ్యాపక తత్వమును, సర్వజ్ఞతను, సర్వశక్తివంత తత్వమును వ్యక్తపరచ జాలదు. ధనికుడైన రాజకుమారుడు మతి మరపును పొంది తానొక బికారినని భావించి, మురికి వాడల యందు సంచరించు విధముగా ఆత్మ తాను పరిమితమైన దానిని అని భావించును. ఇటువంటి భ్రాంతిమయ స్థితి యందు, అహము (Ego) అను రాజు శరీర సామ్రాజ్యమును ఆక్రమించును. 

 భ్రాంతికి గురైన "అహము చైతన్యము" "నేను శరీరమును, ఇది నా కుటుంబము, ఇది నా పేరు, ఇవన్నీ నా సంపదలు" అని పలుకును. అహము తాను శరీర సామ్రాజ్యమును పరిపాలిచు చున్నాను అని  భావించిననూ, నిజమునకు అది శరీరము, మనస్సునకు చెందిన ఒక ఖైదీ. మరియూ మనస్సు, శరీరమూ రెండునూ సూక్ష్మమైన విశ్వప్రకృతికి  చెందిన మాయోపాయము నందలి "పావులు" మాత్రమే.

 సృష్టి యందలి బ్రహ్మాండ జగత్తు నందు దివ్య పరబ్రహ్మకు, మరియూ ప్రకృతొ యొక్క అసంపూర్ణ వ్యక్త రూపమునకు మధ్యన నిరంతరం ఒక నిశ్శబ్ద పోరాటమునకు మనమే సాక్షులము.  దివ్య పరబ్రహ్మ యొక్క నిష్కళంక తత్వము నిరంతమూ మోసపుచ్చు గుణమున్న, దయ్యపు స్వరూపమైన విశ్వవ్యాపిత భ్రాంతి శక్తి కల్పించు అసహ్యకరమైన వికృత స్వరూపములతో నిత్యమూ పోరాడుచుండును. ఒక శక్తి ఎరుకతో సర్వమూ శుభకరమైన "మంచి"ని వ్యక్త పరచుచుండును. మరొక శక్తి రహస్యముగ పనిచేయుచూ "చెడు"ను కల్పించుచుండును. 

బ్రహ్మాండ జగత్తున జరుగుచున్నదే సూక్ష్మ జగత్తున కూడా జరుగుచుండును. జ్ఞానమునకు మరియు అవిద్య/అజ్ఞానముగా రూపొందుచున్న ఒక నిశ్చితమైన భ్రాంతికర శక్తికి - మధ్యన జరుగు యుద్ధమునకు మానవ శరీరము మరియు మనస్సూ ఒక యథార్థమైన యుద్ధభూమి. "ఆత్మ" రాజు యొక్క సామ్రాజ్యమును తన యందు నెలకొల్పదలిచిన ప్రతి ఆధ్యాత్మిక అభిలాషీ "అహము" (Ego) అను రాజును, తిరుగుబాటుదారులను (మనస్సులోని చెడు శక్తులు), అహము యొక్క శక్తివంతులైన సహచరులను ఓడింపవలెను. ధర్మక్షేత్ర, కురుక్షేత్రమందు జరుగు యుద్ధమిదియే.


00000000

No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...