శరీర సామ్రాజ్య వ్యవస్థ - "ఆత్మ" నివసించు ప్రదేశము
మానవుని శారీరిక మానసిక నిర్మాణ వ్యవస్థ చక్కటి పరిపూర్ణతతో కూడియుండి అది భగవంతుని దివ్యమైన ఏర్పాటును (ప్రణాళికను) తనయందు కలిగియున్నది. మనిషి యందు భగవంతుని ప్రతిబింబము ఆత్మ రూపమున ఉన్నది. పురుష వీర్యకణము - స్త్రీ అండము రెండూ కలిసి ఒక జీవకణముగా ఏర్పడినప్పుడు, అదే సమయమున "ఆత్మ" సర్వ శక్తివంతమగు ప్రాణము మరియు చైతన్యముగా ఒక వెలుగు రూపమున ఆ జీవకణము నందు ప్రవేశించును. శిశువు శరీర భాగములు పెరిగి వృద్ధి చెందుచుండగా, పైన తెలిపిన ప్రాణము మెడుల్లా యందు స్థితమై యుండును. మెడుల్లాను "ప్రాణశక్తి స్థావరము" అందురు. కావున మెడుల్లాను "ప్రాణశక్తికి మార్గము" అని చెప్పుదురు. ఎందుకనగా రాజైన ఆత్మ ఈ మార్గము ద్వారా జయప్రదముగా శరీర సామ్రాజ్యము నందు ప్రవేశించును. ప్రాణశక్తి స్థిత స్థావరమున (seat of Life) "ఆత్మ" యొక్క సూక్ష్మమైన జ్ఞానము మొట్టమొదటి సారిగా తనను వ్యక్తపరచుకొనును. అట్టి జ్ఞానము నందు ఆ జీవి యొక్క కర్మానుసారము అతనికి రాబోవు జీవితము యొక్క వివిధ దశలు ముద్రితమై యుండును. "ప్రాణము" లేక "ప్రజ్ఞ కలిగిన క్రియాశీలక ప్రాణశక్తి" (Intelligent Creative Life Force) యొక్క అద్భుతశక్తి వలన మరియు "ఆత్మ" యొక్క దిశానిర్దేశము మేరకు వీర్యకణము అండముతో కలిసిన సంయుక్త బీజము (zygote) దశను దాటి ఆపై పిండరూప దశలను దాటి మానవ శరీర రూపమును పొందును.
సూక్ష్మ తత్వము (astral), కారణ తత్వము (causal) - ఆత్మ యొక్క ఉపకరణములు లేదా సృజనాత్మక శక్తులు. ఆత్మ మొట్టమొదట ప్రాణకణము నందు ప్రవేశించునపుడు అది రెండు సూక్ష్మమైన శరీరపు పొరలను ధరించి యుండును. అందు మొదటి శరీరము కారణ రూపు కలిగిన THOUGHTRONS (ప్రాణకణికలు) చే ఏర్పడినది. దీని చుట్టూ సూక్ష్మ రూపు కలిగిన LIFETRONS తో కూడిన "సూక్ష్మశరీరము" ఏర్పడియుండును. సూక్ష్మ, స్థూల శరీరములు ఏర్పడుటకు కారణమైనది కనుక అది "కారణశరీరము" అని పిలువబడినది. కారణశరీరము 35 ఆలోచనా శక్తులను కలిగియుండును. వీటినుండి 19 మూల తత్వములచే సూక్ష్మ శరీరము, మరియు 16 స్థూల రసాయన తత్వములచే స్థూల శరీరము ఏర్పడును.
సూక్ష్మ శరీరపు 19 మూల తత్వములు: 1. బుద్ధి (intelligence), 2. అహంకారం (ego), 3. చిత్తము (feeling), 4. మనస్సు (mind), 5. చూచుట, వినుట, వినుట, రుచి, వాసన, స్పర్శ అనబడు అయిదు పంచేంద్రియ జ్ఞానములు 6. పునరుత్పత్తి, విసర్జన, మాట్లాడు, నడచు, శారీరిక పరిశ్రమ చేయగలుగు మానసిక శక్తులైనా ఐదు కర్మేంద్రియ జ్ఞానములు, 7. పంచ ప్రాణములు - ఐదు ప్రాణ ఉపకరణములు - అది
1. Crystalizing power - శరీర స్థిరత్వము, పెరుగుదల ,
2. Assimilation - అనగా జీర్ణక్రియ
3. Elimination అనగా విసర్జన
4. Metabolising - జీవప్రక్రియ అనగా జీర్ణమైన ఆహారమును శక్తి రూపమున ఇతర శరీర భాగాలకు సమానముగా పంచుట
5. Circulation అనగా ప్రసరణ. ఇది భౌతిక శరీర కార్యకలాపాలకు చెందినది.
సూక్ష్మ శరీరము నందలి 19 తత్వములు స్థూల శరీరమును నిర్మించి, పోషించి, దానికి జీవమును కల్పించును. సూక్ష్మ శరీరమునకు చెందిన మెదడు (కాంతి తో కూడిన వేయిదళ పద్మము), మరియూ వెన్నెముక (సూక్ష్మ శరీరము యొక్క వెన్నెముకను సుషుమ్న అందురు) మరియూ వాటికి చెందిన ఆరు చక్ర స్థానముల నుండి ఈ 19 తత్వములు పనిచేయును. స్థూల శరీర పరముగా ఈ చక్రస్థానములు మెడుల్లా యందు మరియు వెన్నెముక యందలి 5 స్థావరములైన
1. గొంతుక వెనుకనున్న విశుద్ధ,
2. హృదయమునకు ఎదురుగా వున్న అనాహత,
3. నాభికి ఎదురుగా వున్న మణిపూర,
4. జనేంద్రియములకు ఎదురుగా నున్న స్వాధిష్ఠాన,
5. వెన్నెముక మూలమున వున్న మూలాధార గా వున్నవి.
మనస్సు యొక్క స్థూలమైన శక్తులు స్థూల శరీర భాగములపై వ్యక్తమగును. కానీ ఆత్మ యొక్క సూక్ష్మమైన శక్తులు అనగా మనో చైతన్యము, బుద్ధి, సంకల్పము, చిత్తము - ఇవి మెడుల్లా మరియూ మెదడు యొక్క సున్నితమైన కణజాలము నందు వుండి అచట నుండి వాటి ద్వారా (అనగా మెదడు, మెడుల్లా ద్వారా) వ్యక్తమగును.
No comments:
Post a Comment