1.1 ప్రతి రోజు రాత్రి ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన ఆవశ్యకత
భగవద్గీత మొట్టమొదటి శ్లోకము నందే ప్రతి వ్యక్తీ ప్రతి రాత్రి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అతి ముఖ్యమైన ఆవశ్యకతను ఎత్తి చూపుతున్నది. దాని మూలమున వ్యక్తి తనయందలి ఏవిధమైన శక్తి (మంచి లేక చెడు శక్తి) ఆ రోజు యుద్ధమున గెలిచినది అతనికి స్పష్టముగా అర్థమగును. భగవంతుని ప్రణాళికతో సామరస్య పూరితముగా జీవించదలచిన వ్యక్తి ప్రతి రాత్రి అన్ని కాలములకు ఉపయుక్తమగు ప్రశ్నతో తనను తాను ప్రశ్నించుకొనవలెను. ఆ ప్రశ్న: మంచి, చెడు కర్మలు చేయబడు శరీర ప్రాంతము నందు గుమికూడిన నా యందలి భిన్న ప్రవృతులు ఏమి చేసినవి? నిరంతరము సాగు ఈ పోరాటము నందు ఏ శక్తి ఈ రోజు గెలిచినది? కుటిలమైఅన ప్రలోభమును కల్పించు చెడు ప్రవృత్తులు మరియు వాటికి వ్యతిరేకమైన స్వీయ క్రమశిక్షణ మరియు బుద్ధి - నాకు ఇప్పుడు తెలియజేయవలసినది.
వారేమి చేసిరి?
యోగి మనస్సును కేంద్రీకరించి ధ్యానము చేసిన పిదప తన ఆత్మ శోధనా శక్తిని ఈ విధముగా ప్రశ్నించెను: "మెదడు, వెన్నెముక యందలి చైతన్య స్థావరముల యందున్న ఆత్మ యొక్క సంతానమైన బుద్ధి, దాని ప్రవృత్తులు తమ రాజ్యమును తిరిగి పొందుటకై శరీరేంద్రియ కార్య కలాప క్షేత్రము నందున్న మానసిక ఇంద్రియ శక్తులు చైతన్యమును బాహ్యమునకు లాగు ప్రయత్నమున, ఈ రెండు శక్తులు యుద్ధము చేయుట యందు ఆసక్తిని కలిగి అవి ఏమి చేసినవి? ఈ రోజు ఎవరు గెలిచిరి?
సాధారణ మానవుడు యుద్ధము నందు తగిలిన గాయపు చిహ్నములను కలిగియుండి మిక్కిలి వేధింపబడిన యోధుని వలె, ఆ యుద్ధములను చేయు విధములను అన్నిటినీ తెలిసియుండును. ఆ యుద్ధభూమిని అర్థము చేసుకొనుట యందు శత్రుసైన్యము యొక్క దాడి వెనుకనున్న శాస్త్రీయతను అర్థము చేసుకొనుట యందు అతనికి గల శిక్షణ కొరవడినదై యుండును. అతను ఆ యుద్ధమును చేయగలుగు జ్ఞానమును సంపూర్ణముగా కలిగి యుండిన యెడల అతని విజయావకాశములు మరింత మెరుగుపడి అతనికి దిగ్భ్రమను కలిగించు ఓటములు తగ్గిపోవును.
కురుక్షేత్ర యుద్ధమునకు గల కారణములను చారిత్రాత్మకముగా పరిశీలించిన యెడల పాండుపుత్రులు తమ రాజ్యమును ధర్మయుతముగా పరిపాలించు సమయమున, ధృతరాష్ట్ర మహారాజు పుత్రుడైన , దుష్టుడైన దుర్యోధనుడు మాయోపాయముచే పాండవుల రాజ్యమును అపహరించి, వారిని దేశబహిష్కరణ గావించెనని తెలియుచున్నది.
సూచనాత్మకముగా, శరీరమను రాజ్యము "ఆత్మ" అను రాజునకు మరియు అతని సంతానమైన సద్గుణ ప్రవృత్తులకు న్యాయ సమ్మతముగా చెందినది. కానీ అహము మరియు దుష్టులైన, నీచులైన అతని సంతాన ప్రవృత్తి మోసపూరితముగా ఆత్మ యొక్క రాజ్యమును కాజేసిరి. "ఆత్మ" అను రాజు తన సామ్రాజ్యమును తిరిగి పొందుటకు ప్రయత్నించునపుడు శరీరము, మనస్సు యుద్ధభూమిగా మారును. "ఆత్మ" యను రాజు శరీర సామ్రాజ్యమును పరిపాలించు విధానము, అతడు దానిని కోల్పోయి మరలా దానిని గెలుచుకొను విధానమును తెలుపునదే "గీతా సారము".
No comments:
Post a Comment