Saturday, March 23, 2024

1.1 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము

 

PAGE 7

EXPANDED COMMENTARY: THE BATTLE OF LIFE

 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము 

ఒక వ్యక్తి తన తల్లి గర్భము నందు జీవము పొందినది మొదలు, అతడు చివరి శ్వాస ను విడచునంత వరకు అతను తన ప్రతి జన్మ యందు అనేక విధములైన సంఘర్షణలను - జీవ సంబంధమైనవి, వంశపారంపర్యమైనవి, సూక్ష్మ క్రిమి సంబంధమైనవి, సాంఘిక పరమైనవి, నైతిక పరమైనవి, రాజకీయ పరమైనవి, సామాజిక ప్రమైనవి, మానసిక పరమైనవి, అధిభౌతికమైనవి - అనేక విధములైన బాహ్య పరమైన, అంతర్గతమైన సంఘర్షణలను ఎదుర్కొనును. ప్రతి సంఘర్షణ యందు మంచి - చెడు శక్తులు తమ విజయమునకై పోరాడుచుండును. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మానవుడు ఈ పోరాటము నందు తన ప్రయత్నములు అన్నిటినీ ధర్మముతో అనుసంధానమగు విధముగ యత్నించవలెను. అంతిమమైన లక్ష్యము ఏమనగా ఆత్మ సాక్షాత్కారము - ప్రతి మనిషి యందున్న ఆత్మను అతను కనుగొనుటయే! ఆత్మ భగవంతుని ప్రతిబింబము మరియు శాశ్వతమైన, నిత్య జాగరూకమైన, నిత్య నూతన ఆనందమైన పరబ్రహ్మతో ఏకత్వము కలిగినది. 

 ప్రతిజన్మ యందు ఆత్మ మొట్ట మొదటగా, పునర్జన్మను పొందగోరు ఇతర ఆత్మల నుండి పోటీని ఎదుర్కొనును. ఒక నూతన మానవ దేహము ఏర్పడు ప్రక్రియ యందు పురుషుని వీర్యకణము, స్త్రీ అండము - రెండును కలసినపుడు, జన్మ జన్మకు నడుమ ఆత్మలు నివసించునట్టి దివ్య లోకమునందు మెరుపు వంటి ఒక్క వెలుగు మెరియును. ఆ వెలుగు,  ఒక ఆత్మ - అది మునుపటి జన్మల యందు తాను సముపార్జించుకొనిన కర్మలకు అనుగుణమగు ఒక పద్ధతి క్రమమును ప్రసరింప జేయగా, దానికి అనుగుణమైన ఆత్మ ఆ వెలుగునకు ఆకర్షింపబడును. అది గత జన్మల యందు తానుగ చేసుకొనిన కర్మల ప్రభావము. ప్రతి జన్మ యందు "కర్మ" యనునది పాక్షికముగ దానికి అనుగుణముగ వంశ పారంపర్య శక్తులతో తానుగ సమకూడును. ఒక శిశువు యొక్క ఆత్మ ఆ ప్రకారముగ తన పూర్వ జన్మపు కర్మలకు అనుగుణమైన వంశపారంపర్య కుటుంబమునకు ఆకర్షింపబడును. తల్లి గర్భము నందు జీవము నింపుకొనిన ఆ ఒక్క కణము నందు ప్రవేశించుటకు  అనేక ఆత్మలు పోటీ పడును. వాటి యందు ఒక్క ఆత్మ మాత్రమే విజయము పొందును (తల్లి ఒకరి కన్న ఎక్కువ మందిని గర్భమున ధరించినపుడు, ప్రాథమిక కణములు కూడ గర్భమున ఒకటి కన్న ఎక్కువ యుండును) . 

 తల్లి గర్భమున ఎదుగుచున్న శిశువు వ్యాధులతో, చీకటితో పోరాడుచు, పరిమితమునకు బంధింపబడి యుండును. అప్పుడప్పుడూ తన దివ్యత్వమును గుర్తుకు తెచ్చుకొనుచుండును. ఎదుగుచున్న శిశువు నందలి ఆత్మ, తాను ప్రస్తుతము నివసించుచున్న శరీరము యొక్క ఎదుగుదల, తన గత జన్మల కర్మలను, మంచి చెడుల ప్రభావమును అనుసరించి యుండుటను గమనించి దానితో సంతృప్తి చెంది యుండును. దీనికి అదనముగ అది  బాహ్య ప్రపంచము నుండి తనకెదురగు ప్రభావమును ఎదుర్కొనుచుండును. ఆ ప్రభావములు తన పరిసరముల వలన, తల్లి చేయు కర్మల వలన, బాహ్యమైన శబ్దములు, తల్లి యొక్క భావనల వలన, తల్లి అనుభవించు ప్రేమ, ద్వేషపు తరంగముల వలన, తల్లి యొక్క ప్రశాంతత మరియు కోపముల వలన ఏర్పడుచుండును.   శిశువు జన్మను పొందిన పిదప అది సహజముగ తన సుఖమును కోరి, జీవించి యుండవలెనను సహజమైన స్వభావమును కలిగియుండి, దానికి వ్యతిరేకముగ తన పూర్తి ఎదుగుదల లేని శరీరముతో పెనుగులాడు చుండును.

 ఎదుగుచున్న బాలుడు తనకు ఎరుక గలిగిన స్పృహతో దిశానిర్దేశము లేని ఆట పాటల కోరికలతో సమయము గడుపుచూ ఆపై విద్యను అభ్యసించి విద్యకు చెందిన ఒక క్రమబద్ధమైన శిక్షణను పొంది జీవితమున పెనుగులాడును. క్రమముగా జీవితమున ఇతనికి మరిన్ని తీవ్రమైన సంఘర్షణలు ఎదురగును. అవి అతని కర్మ ప్రవృత్తి ప్రభావమున అతని లోని స్వభావము నుండి లేక, బాహ్యమైన పరిసర ప్రభావము వలన మరియూ చెడు సహవాసము వలన ఏర్పడు సంఘర్షణలు. 

 యవ్వనము నందు వ్యక్తి తను ఎదురుచూడనటు వంటి అనేక సమస్యలను అకస్మాత్తుగా ఎదుర్కొన వలసి వచ్చినదని గ్రహించును -- అవి లైంగిక వాంచలు, ధనమును సులువుగా అధర్మ మార్గమున సంపాదించుట, తన సహచరులనుండీ ఎదురగు వత్తిడి, సమాజము యొక్క ప్రభావము మొదలగునవి. యవ్వనమున అడుగిడిన వారు తమను దండెత్తుచున్న ప్రాపంచిక సమస్యల సైన్యమును ఎదుర్కొనుటకు తమ చెంత "జ్ఞానము" అను ఖడ్గము లేదని గ్రహింతురు. 

వయోజనులు (adults) తమ యందు సహజముగా వున్న జ్ఞానమునూ, ఆధ్యాత్మిక విచక్షణను అభివృద్ధి పరచుకొనుటను తెలియక దానిని ఉపయోగించుట తెలియక తమ శరీర సామ్రాజ్యము మిక్కిలి కృరముగా అదుపు చేయలేని విధముగా కష్టములను కలిగించు చెడు కోరికల యొక్క, విధ్వంసకర అలవాట్ల యొక్క, వైఫల్యముల యొక్క, అజ్ఞానము యొక్క, కోరికల యొక్క విషాదము యొక్క తిరుగుబాతుదారులచే ఆక్రమింపబడినదని తెలిసికొందురు. 

 కొంతమంది వ్యక్తులు మాత్రము తమ శరీర సామ్రాజ్యము నందు ఒక నిరంతర సంగ్రామము జరుగుచున్నదని గ్రహించి యుందురు. కానీ, సాధారణముగా పూర్తి విధ్వంసము సంభవించిన పిదపనే వ్యక్తులు తమ జీవితములు నాశనము గావింపబడినవని గ్రహింతురు. మనిషి విజయము వైపు ముందుకు సాగుటకు ఆరోగ్యమునకు, శ్రేయస్సునకు, ఆత్మ నిగ్రహమునకు మరియూ జ్ఞానమునకు దినదినమూ నూతనముగా ప్రారంభించి ఆత్మ సామ్రాజ్య ప్రాంతమును ఆక్రమించిన తిరుగుబాటుదారులైన అజ్ఞానము నుండి ఒక్కొక్క అంగుళముగా చేజిక్కించుకొనవలెను. ప్రతి రోజూ కొంచెము కొంచెముగా మంచి వైపు పయనించాలి. 

 జాగరూకుడగు యోగి, సాధారణ మానవులు ఎదుర్కొను బాహ్యమైన యుద్ధముతో పాటూ, తన అంతరంగము నందు మరొక యుద్ధమును ఎదుర్కొనును. అది ఒక వైపు ప్రతికూలశక్తులైన చంచలత్వమునకు ( మనస్సు వలన కలుగునవి - ) మరియూ మరొకవైపు ధ్యానము చేయవలెను అను అనుకూలమైన ప్రయత్నము/కోరికకు మధ్యన జరుగు యుద్ధము. యోగి ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము నందు తానుగా తిరిగి స్థిర పడుటకు ప్రయత్నించు సందర్భమున జరుగును. ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము ఏదనగా - వెన్నూ, వెన్నెముక, మెదడూ నందలి ప్రాణశక్తి, దివ్యచైతన్యమునకు చెందిన సూక్ష్మ చక్ర స్థానములు. 


000000000000




No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...