Friday, March 22, 2024

1.1 కురుక్షేత్రము, సంజయుని ప్రతీకాత్మకత

  


ఈ కలహమాడు శక్తుల  (mind and wisdom -   మనస్సు మరియు బుద్ధీ ) యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము. "కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, "క్షేత్ర" అనగా భూమి. భౌతిక, మానసిక, ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరీరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియూ శరీరము అనబడు ఆ క్షేత్రముననే జరుగును. భగవద్గీత యందలి ఈ శ్లోకమున ఈ శరీరము "ధర్మక్షేత్రము"  అని పిలువబడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనద్, అందుచేతనే పవిత్ర క్షేత్రముగా చెప్పబడినది). ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి ( అనగా పాండుపుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్య కలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) ఈ క్షేత్రము నందే ధర్మ సంగ్రామము జరుగనున్నది. 

 PAGE 6

సంజయుని సూచనాత్మకత/ప్రతీకాత్మకత: 

నిష్పక్షపాతమైన అతీంద్రియ అంతఃపరిశీలన

"సంజయ" శబ్దార్థము "సంపూర్ణముగ జయించిన; తనను తాను జయించిన వాడు". స్వార్థ పూరిత బుద్ధి లేనివాడు మాత్రమే నిష్పక్షపాతముతో తనకు తాను పరిశీలించుకొను శక్తి సామర్థ్యమును కలిగి యుండును. ఆ విధముగ భగవద్గీత యందు సంజయుడు ఒక "దివ్యమైన అంతర్దృష్టి" యనబడు వాడు. సాధనాపేక్ష గల సాధకునికి సంజయుడు "నిష్పక్షపాత అతీంద్రియ స్వయం పరిశీలన" "వివేకవంతమైన ఆత్మ పరిశీలన". అది తనను తాను వ్యక్తిగతముగా వేరు వ్యక్తి యని భావించి పక్షపాతరహితముగా పరిశీలించుకొను శక్తి, మరియు ఖచ్చితముగ విమర్శించుకొను సమర్థత.  వ్యక్తికి తనకు తెలియకనే తన యందు ఆలోచనలు కలుగుచుండును. ఆత్మ పరిశీలన యనగా అంతర్ దృష్టి శక్తిచే మనస్సు తన ఆలోచనలను తానే పరిశీలించుకొను శక్తి.    అది బుద్ధిని ఉపయోగించి తర్కింపక, తానుగా అనుభూతి చెంది తెలిసికొనుట - అది భావోద్వేగపు పక్షపాతముతో కాదు. సుస్పష్టమైన ప్రశాంతమైన అంతర్ దృష్టి తో తెలిసికొనుట.  

 మహా భారతము నందు భగవద్గీత ఒక అంతర్భాగ అంశము. వేదవ్యాసుడు సంజయునికి యుద్ధ భూమి యందు జరుగు సర్వము సుదూరము నుండి చూడగలుగు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించెను. ఆ శక్తి వలన సంజయుడు అంధుడైన ధృతరాష్ట్ర మహారాజునకు యుద్ధమున జరుగు విషయములను వివరింపగలిగెను. సంజయుని అట్టి వివరణ యందలి భాగముగ వేదవ్యాసుడు భగవద్గీతను మహాభారతమున ఒక అంశముగ లిఖించెను. కావున భగవద్గీత యందలి మొదటి శ్లోకమున ధృతరాష్ట్రుని ప్రశ్న వర్తమాన కాలమునకు చెందియుండవలెనని ఎవ్వరైననూ భావింతురు. అచ్చట వ్యాసుడు ఉద్దేశ్యపూర్వకముగా "ఏమి చేసిరి" అను క్రియను భూతకాలమునకు చెందినదిగా లిఖించెను.   

 వివేకవంతుడైన విద్యార్థికి ఇది ఒక స్పష్టమైన సూచన. ఆ సూచన ఏదనగా - భగవద్గీత ఉత్తర భారత దేశము నందలి కురుక్షేత్రమున జరిగిన చారిత్రాత్మక యుద్ధమును సందర్భవశముగా ప్రస్తావించు చున్నది. వ్యాసుడు ప్రధానముగ మానవుని దైనందిన జీవితమున జరుగు ఒక సర్వ సామాన్యమైన యుద్ధము యొక్క గతిని లిఖించ దలచినచో, అతను ధృతరాష్ట్రుని తో సంజయుని ఉద్దేశించి వర్తమాన కాల క్రియను ఉపయోగించి " నా పుత్రులు మరియూ పాండు పుత్రులు - వారిపుడు ఏమి చేయుచున్నారు?" అని ప్రశ్నింప జేసి యుండును.  

 ఇది మిక్కిలి ముఖ్యమైన అంశము. భగవద్గీత యందలి కాలమునకు అతీతమైన సందేశము ఒక చారిత్రాత్మకమైన యుద్ధమునకు మాత్రమే సంబంధించినది కాదు. అది విశ్వము నందు మంచికి - చెడుకు మధ్య జరుగు సంఘర్షణను సూచించునది. అంతియే గాక అది పరమాత్మకు - ప్రకృతికి, ఆత్మకు - శరీరమునకు, జీవితమునకు - మరణమునకు, ఆరోగ్యమునకు - అనారోగ్యమునకు, విజ్ఞానమునకు - అజ్ఞానమునకు, శాశ్వతత్వమునకు - అశాశ్వతత్వమునకు, ఆత్మ నిగ్రహమునకు - ప్రలోభమునకు, బుద్ధికీ - గ్రుడ్డిదైన ఇంద్రియ మనస్సుకు మధ్యన జీవితమున నిరంతరము జరుగు సంఘర్షణను సూచించును. మొదటి శ్లోకము నందు "ఏమి చేసిరి" అని ధృతరాష్ట్రుడు అడుగుట యందు భూతకాల క్రియను వ్యాసుడు ఉపయోగించి, ఒక వ్యక్తి తన మనస్సు నందు ఆ రోజు జరిగిన  సంఘర్షణలను ఆత్మ పరిశీలనా శక్తి ని ఉపయోగించి పునస్సమీక్షించుకొని, ఆ రోజు అనుకూలమైన ఫలితములు సంభవించెనా లేక ప్రతికూల ఫలితములు సంభవించెనా యను వానిని నిర్ణయించుకొనుటను వ్యక్తపరచు చున్నవి. 


000000000

sanjaya, dhritarashtra, mind, wisdom

No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...