రెండు వ్యతిరేక శక్తులు:
అధమ స్థాయికి చెందిన మనస్సు యొక్క ప్రవృత్తులు Vs ఆత్మ యొక్క విచక్షణా శక్తి - బుద్ధి
ఈ క్షేత్రమునందు పోరాడు రెండు వ్యతిరేక శక్తులు, లేక రెండు అయస్కాంత ధృవములు ఏవనగా 1. విచక్షణతో కూడిన తెలివి (బుద్ధి) మరియు 2. ఇంద్రియాసక్తి కలిగిన మనస్సు. "బుద్ధి" అను శుద్ధమైన విచక్షణా శక్తి కి దృష్టాంతముగా "పాండు రాజు" సూచింపబడెను. అతడు కుంతీదేవి భర్త. కుంతీదేవి అర్జునుని మరియు ఇతర సోదర పాండవుల తల్లి. "పాండవులు" నివృత్తి ధర్మ సూత్రములు అనబడు ప్రాపంచిక విషయముల పరిత్యాగమును అనుసరించువారు. "పాండు" నామము "పండా" అను శబ్దము నుండి వెలువడినది. దీని అర్థము "తెలుపు". ఇది శుద్ధమైన బుద్ధి యొక్క స్పష్టతకు దృష్టాంతము. "మనస్సు"కు దృష్టాంతముగా గ్రుడ్డి "ధృతరాష్ట్ర" మహారాజు సూచింపబడెను. అతడు నూరుగురు కౌరవుల తండ్రి. కౌరవులు అనగా శరీరము నందలి ఇంద్రియ భావ ప్రవృత్తులు - ప్రాపంచిక ఆనంద ప్రవృత్తిని కలిగిన వారు. "బుద్ధి" తన వివేచనను ఆత్మ కు చెందిన "అధిచేతన" (super consciousness) నుండి గ్రహించును. "ఆత్మ" కారణ శరీరమునకు చెందిన సూక్ష్మ మైన ఆధ్యాత్మిక మెదడు, వెన్నెముక స్థావరముల యందు గల చైతన్యము నందు స్థితమై యుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు ఒక సూక్ష్మమైన అయస్కాంత ధృవము వంటిది. ఇది భౌతిక ప్రపంచము వైపు బహిర్ముఖమై యుండును. ఇది భౌతిక శరీరపు మెదడునందు "పాన్స్ వరోలి" (Pons Varoli) అను ప్రాంతము నందుండి ఎల్లపుడూ శరీరమందలి ఇంద్రియములను సమన్వయ పరచు చుండును. ఆ విధముగా నున్న బుద్ధి, చైతన్యమును సత్యమైన దానివైపు అనగా "ఆత్మ సాక్షాత్కారము" వైపు లాగుచుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు చైతన్యమును సత్యము నుండి మరల్చి, దానిని శరీరమునకు చెందిన బాహ్యమైన ఇంద్రియ కార్యకలాపముల వైపు లాగుచుండును. ఆ విధముగా మనస్సు భ్రాంతి మయ ప్రాపంచిక ద్వంద్వములగు మాయకు చెందినదై యుండును.
"ధృతరాష్ట్ర" అను నామము "ధృత" అను మూలము నుండి వెలువడింది. దీని భావము - పట్టి ఉంచిన, ఆధారపడిన, గట్టిగా లాగి ఉంచు". "రాష్ట్ర" అనగా "రాజ్యము, రాజ అనగా పాలించు" అని భావము. దృష్టాంత పరముగా దీని భావము - ధృతం రాష్ట్రం ఏన - అనగా ఇంద్రియ రాజ్యమును ధృఢముగా పట్టుకుని రాజ్యమేలువాడు అని అర్థము.
రథమునకున్న గుర్రములను కళ్ళెములు ఒకటిగా జతపరచి ఉంచు విధముగా "మనస్సు" ఇంద్రియాలను సమన్వయ పరుస్తుంది. శరీరము - రథము, ఆత్మ - ఆ రథము యొక్క యజమాని; తెలివి - సరథి; ఇంద్రియములు గుర్రములు. మైండ్/మనస్సు గుడ్డిదని చెప్పబడింది. కళ్ళెములు గుర్రముల నుండి ప్రేరణను రథ సారథి కి, రథ సారథి యొక్క మార్గదర్శకత్వమును గుర్రములకు అందజేయును. అదే విధముగా గ్రుడ్డి మనస్సు తానుగా జూచి గ్రహింపజాలదు. మరియు తానుగా సూచనలను ఇవ్వ జాలదు. కానీ అది ఇంద్రియముల నుండి భావములను గ్రహించి "తెలివి" ఇచ్చిన తీర్పునూ, సూచనలనూ ఇంద్రియములకు అందించును. తెలివిని "బుద్ధి" అనగా శుద్ధమైన విచక్షణా శక్తి నిర్దేశించినచో ఇంద్రియాలు అదుపులో వుంటాయి. తెలివిని ప్రాపంచిక కోరికలు నిర్దేశించినచో ఇంద్రియములు విశృంఖలతతో అదుపు తప్పును.
No comments:
Post a Comment