మొదటి శ్లోకము - 1వ విభాగము
"వారు ఏమి చేసిరి?" - మానసిక, ఆధ్యాత్మిక రణరంగ పరిశీలన
1వ శ్లోకము
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ||
ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికెను
"పవిత్రమైన కురుక్షేత్ర రంగమందు (ధర్మక్షేత్రము-కురుక్షేత్రము) నా పుత్రులూ మరియూ పాండు పుత్రులు ఒక చోట చేరి, యుద్ధ కాంక్ష గలవారై, వారేమి చేసిరి, ఓ సంజయా?"
గురూజి చే ఇవ్వబడిన పద అర్థము: అంధుడైన ధృతరాష్ట్ర మహా రాజు (అనగా గుడ్డి మనస్సు) నిజాయితీ పరుడైన సంజయుడిని (నిష్పక్షపాతము, అంతఃకరణ పరిశీలన) ఈ విధముగా ప్రశ్నించెను: "నా పుత్రులైన కౌరవులు (దుర్మార్గపు ఉద్రేకపూరితమైన మానసిక ఇంద్రియ ప్రవృత్తులు, ధర్మపరులైన పాండవ పుత్రులు ( శుద్ధమైన బుద్ధి, విచక్షణా శక్తి గుణములు ) కురుక్షేత్రమందలి (కర్మలను చేయు శరీర క్షేత్రము) ధర్మక్షేత్రము నందు (పవిత్ర క్షేత్రమునందు ) - అంతరంగము, తన ఆధిపత్యమును నిలుపుకొనుటకై, యుద్ధమును చేయు కాంక్ష కలవారై అచటకు చేరగా అచట ఏమి జరిగినది?
ధృతరాష్టృని ప్రశ్న యందలి దృష్టాంత ప్రాముఖ్యత
ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతో సంజయుడిని కురుపాండవుల మధ్యన యుద్ధము, కురుక్షేత్రము నందు ఏవిధముగా జరిగినది అను దానిని పక్షపాత రహితముగా తెలుపమని అడుగగా- దృష్టాంత పరముగా ఒక ఆధ్యాత్మిక సాధకుడు తాను ఆత్మ సాక్షాత్కారమును గెలుచుటకై ధర్మ బద్ధమైన యుద్ధమునకు చెందిన తన దినచర్యలను ప్రతి దినమూ పునః పరీక్షించుకుని తనను తాను ప్రశ్నించుకొనుటను సూచించు చున్నది.
నిజాయితీ తో కూడిన ఆత్మ పరిశీలన ద్వారా సాధకుడు తన కార్యకలాపములను విశ్లేషించుకొని, తన యందలి ఒకదానినొకటి ఎదిరించు మంచి-చెడు గుణముల యొక్క బలమును నిర్థారించుకొనును. అనగా అంచనా వేయును; ఆత్మనిగ్రహమును ఎదిరించు ఇంద్రియ లోలత్వము; విచక్షణతో కూడిన తెలివిని వ్యతిరేకించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు; ధ్యానము నందలి ఆధ్యాత్మిక ధృఢ సంకల్పమును ఎదిరించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు, శారీరిక చంచలత్వము; దివ్యమైన ఆత్మ చైతన్యమునకు ప్రతికూలముగా అజ్ఞానము మరియు అయస్కాంత శక్తి వలె ఆకర్షించు అధమ స్థాయికి చెందిన అహము యొక్క ప్రవృత్తి - మున్నగు కలహమాడు శక్తుల యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము.
("కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, మరియు క్షేత్ర అనగా భూమి). భౌతిక మానసిక ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియు శరీరము అనబడు ఆక్షేత్రముననే జరుగును. భగవద్గీతయందలి ఈ శ్లోకమున ఈ శరీరమును ధర్మ క్షేత్రము అని పిలువ బడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనది. అందుచేతనే పవిత్ర క్షేత్రం గా చెప్పబడినది)
ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి (అనగా పాండు పుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్యకలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) మధ్యన ఈ క్షేత్రమునందే ధర్మ సంగ్రామము జరుగనున్నది.
మరొక భావార్థము తో ధర్మ క్షేత్రము నిష్ఠతో కూడిన ఆధ్యాత్మిక విధులను మరియు ఆ విధమైన కార్యకలాపములను చేయు ప్రాంతమును సూచించును. (అనగా ధ్యానము నందు యోగి యొక్క కార్యకలాపములు). దానికి విరుద్ధముగా "కురుక్షేత్రము" - అనగా ప్రాపంచిక బాధ్యతలను సూచించును. ఆ విధముగా లోతైన దృష్టాంత భావమును పరికించిన యెడల "ధర్మక్షేత్రము-కురుక్షేత్రము" ఆత్మ సాక్షాత్కారమును సాధించుటకు యోగ-ధ్యానమునకు చెందిన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగు శరీరమందలి అంతః క్షేత్రమును సూచించును. ఆ అంతఃక్షేత్రమేదనగా దివ్య చైతన్యమును కలిగియున్న మెదడూ, వెన్నెముక యందలి ఏడు సూక్ష్మ చక్రస్థావరములు.
*****************************
No comments:
Post a Comment