Monday, July 6, 2020

ప్రదోష వ్రతం

ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.

🌻 ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని, ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శనివారం నాడు ప్రదోష సమయంలో శివారాధన చేసినట్లయితే కర్మ దోషాలు పోయి సుఖశాంతులు పొందవచ్చు. శని కర్మ కారకుడు, శివుడు సంహార కారకుడు. కాబట్టి శని ప్రదోష సమయంలో శివారాధన చేయడం ఉత్తమం.

🌻 వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానంచేసి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు, పండ్లు వంటివి తీసుకుని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు ఉడికించని పదార్థాలను స్వీకరించి, మరుసటి రోజు వండిన ఆహారం తీసుకోవాలి. సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం, సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే రెండున్నర గంటలపాటు పూజ జరుగుతుంది.

🌻 ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరించవచ్చు. స్కంధపురాణం ప్రకారం ప్రదోష వ్రతం రెండు విధాలు. పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం మొదటి విధానం..కాగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం రెండవ విధానం. వ్రతం చేసేవారు ముందు గా గణేషు ని పూజించి తరువాత శివ పార్వతుల తో పాటు సుబ్రహ్మణ్యస్వామి, నంది పూజించాలి.

🌻 శివలింగానికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాల తో అభిషేకించి బిల్వదళాలతో పూజించాలి. తరువాత ప్రదోష వ్రత కథ , శివ పురాణ శ్రవణ చేయాలి. మహా మృత్యుంజయ మంత్రం ని108 సార్లు పఠించాలి. పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది. సంతానం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.

No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...