మొదటి అధ్యాయము
అర్జున విషాద యోగము
అధ్యాయము యొక్క ప్రాముఖ్యత
ప్రఖ్యాతి చెందిన భగవద్గీత యోగశాస్త్రమునకు చెందిన ఒక సర్వోత్కృష్టమైన ప్రమాణ గ్రంధము. అది మానవుడి విశాల దృక్పథ అన్వేషణను ఒక ఆచరణీయత్మక విధానము తోను, నిగూఢ తత్వము తోను బోధించుచున్నది. మానవ జాతి తరతరాలుగా ఈ ప్రియమైన భగవద్గీత అందించిన ఉపదేశముల యందు స్వాంతనను, ఆశ్రయమునూ పొందినది. భగవద్గీత సాధకుడు ఆచరణీయాత్మకముగా అనుసరింపవలసిన ఆధ్యాత్మిక సూత్రములను తెలుపుటయే గాక, అవి ఒక పరిపూర్ణ యోగి సాధించిన జ్ఞానమును వ్యక్తపరచు పరిపూర్ణ సూత్రములు అని కూడా తెలియుచున్నది.
ఆధునిక గ్రంధముల ఉపోద్ఘాతమందు, ఆ గ్రంధమందలి విషయముల యొక్క సంగ్రహ ప్రస్తావన గావింపబడును. కానీ భారతదేశపు ప్రాచీన కాల హైందవ గ్రంధ రచయితలు గ్రంధము నందలి మొదటి అధ్యాయము నందు వారి లక్ష్యమును వ్యక్త పరచెదరు. ఆ విధముగా భగవద్గీత యందలి మొదటి అధ్యాయము గ్రంధము నందు తరువాత ప్రస్తావించబడు పవిత్ర సంభాషణకు పరిచయ వాక్యముల వలె ఉండును. ఈ మొదటి అధ్యాయము రంగమును సిద్ధము చేసి దానికి తగిన నేపథ్యమును ఏర్పాటు చేయగా, అందలి విషయములకు ప్రాముఖ్యత లేదు అను ఒక తేలిక భావముతో ఈ గ్రంధమును అధ్యయనము చేయరాదు. ఈ గ్రంధమును అధ్యయనము చేయునపుడు దాని రచయిత సుప్రసిద్ధుడైన వ్యాస మహర్షి ఈ గ్రంధము నందు కల్పించిన అన్య విషయ సూచనను గుర్తించి చదువవలెను. అది యోగ శాస్త్రమునకు చెందిన ప్రాథమిక సూత్రములను తెలియ చేయును
మరియూ అది భగవంతునితో ఐక్యతను అనగా ముక్తి లేక కైవల్యమును సాధించు మార్గమును అనుసరించు యోగి తన సాధన ప్రారంభమున ఎదుర్కొను కష్టములను వివరించును. యోగ సాధన లక్ష్యము భగవంతునిలో ఐక్యత పొందుట. మొదటి అధ్యాయమునందు అంతర్నిహితము గావింపబడిన సత్యములను అర్థము చేసికొనుట అనగా : యోగ ప్రయాణము కొరకు చక్కగా ఏర్పాటు చేసిన వ్యవస్థ యందు పయనించుటయే. పూజ్యులైన నా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు సాక్షాత్ జ్ఞానావతారము. వారు మొదటి అధ్యయము నందలి కొన్ని ప్రముఖమైన శ్లోకముల యందు నిగూఢమై యున్న అర్థమును వెలికి తీయుటను నాకు నేర్పించిరి. వారు అప్పుడు ఈ విధముగా పలికిరి - "నీ వద్ద తాళము చెవి కలదు. నీ యందలి అంతరంగ ప్రశాంతతతో నీవు ఈ గ్రంథమందలి ఏ శ్లోకమునైననూ అవగాహన చేసుకొని, దాని విషయమునూ సారమునూ తెలుసుకొనగలవు." వారిచ్చిన ప్రోత్సాహముతో మరియూ వారి కృపతో నేను ఈ గ్రంథమును సమర్పించు చున్నాను.
************************
No comments:
Post a Comment