రాజైన "ఆత్మ" పరిపాలనయందు శరీర సామ్రాజ్యము
శరీరమందలి ప్రతీ భాగమునకు (కర్మేంద్రియాలు + జ్ఞానేంద్రియాలూ) ఆ శరీరభాగము చేయు పనిని అనుసరించి, దృష్టాంత పూర్వకముగా దానిని వివరించెడి పేరును ఏర్పరచి,
1. ఆ శరీర భాగములు వాటిని పరిపాలించువారిని అనుసరించి (పరిపాలించెడివారు ఆత్మయా లేక అహమా)
2. అందు నివసించు వారిని అనుసరించి (చక్రాల్లోని శక్తులు - ఆత్మ పరిపాలనా లేక అహం పరిపాలనా)
ఆ శరీరభాగములు ఏ విధముగా ప్రభావితము అగునో అనునది స్పష్టంగా తెలియజేయవచ్చును. 17వ పేజీ నందలి చిత్రము రాజైన ఆత్మ యొక్క పరిపాలన యందు శరీర సామ్రాజ్యము వుండు విధమును సూచించును.
పెద్దమెదడు, మెడుల్లా యందు వసించు అధిచేతన, క్రీస్తు చైతన్యము మరియూ విశ్వ చైతన్య స్థావరమును ఆత్మ యొక్క రాచరికపు భవనము (రాయల్ పాలెస్) అందురు. రాజైన ఆత్మ ఆ స్థావరము నుండి తన దివ్యానంద అనుగ్రహమును, జ్ఞానమునూ, శక్తినీ, శరీర సామ్రాజ్యమున కంతటికీ అనుగ్రహించును.
మెడుల్లా, విశుద్ధ, అనాహత చక్రస్థానములు ఉన్నత చైతన్య స్థావరములు. వీటిని పెద్దల సభ లేక ఎగువ సభ అని పిలువ వచ్చును. ఈ స్థావరముల యందలి దివ్యమైన విచక్షణా శక్తులు మిక్కిలి విశ్వాస పూరిత పౌరులవలె రాజైన ఆత్మకు సహాయమును అందించెదరు. ఈ విచక్షణా శక్తులు 'బుద్ధి ' అను ప్రధానమంత్రి అధీనమున వుందురు. బుద్ధి అనునది సత్యమును తెలుపును మరియూ పరమాత్మ వైపు ఆకర్షితమై వుండును.
మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్ర స్థానములు దిగువ చైతన్య స్థావరములు. ఈ స్థావరములను సామాన్యుల సభ లేక దిగువ సభ అని పిలువవచ్చును. ఈ స్థావరముల యందలి ఇంద్రియ శక్తులు (వీటినే మనస్సు లేక ఇంద్రియ చైతన్యము అని కూడా అంటారు) ప్రధాన మంత్రి యగు బుద్ధికీ, దివ్యమైన విచక్షణా శక్తులకు విధేయులై వుంటారు. సామాన్య మానవుడు ప్రధానముగా మనస్సు యొక్క ప్రభావమునకు లోబడి యుండును. ఈ ప్రభావము పరమాత్మ నుండి విముఖమై వుండుట వలన అది సత్యమును మరుగు పరచును. మరియూ మానవ చైతన్యమును సృష్టి విషయములతో ముడి వేసి వుంచును. ఇంద్రియ చైతన్యము దిగువనున్న మూడు వెన్నెముక చక్రముల ద్వారా పని చేయును. కానీ, మనిషి జీవితము ఆత్మ యొక్క మార్గదర్శకత్వము నందు వుండిన యెడల మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రముల నుండి పనిచేయు ఇంద్రియములు అనాహత, విశుద్ధ, మెడుల్లా యందలి చైతన్యమునకు చెందిన విచక్షణా శక్తులకు విధేయులై యుండును. అనగా ప్రాపంచిక వ్యక్తి మనస్సు యొక్క ప్రాబల్యమున్న మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార చక్ర స్థావర చైతన్యమున జీవించును. ఆధ్యాత్మిక జీవనము గడుపు వ్యక్తి ఎగువనున్న అనాహత విశుద్ధ మెడుల్లా చక్ర స్థావరముల యందలి విచక్షణ కలిగిన బుద్ధి ప్రాబల్యమున జీవించును.( బుద్ధి అనగా సత్యమును ఎరుక పరచు చైతన్యము.)
చిత్రపటము 1 (వివరణ)
ఆత్మ రాజుగా పరిపాలించునపుడు శరీర సామ్రాజ్యము వుండు విధము:
1. పెద్ద మెదడు, మెడుల్లా: రాజైన 'ఆత్మా యొక్క భవనము, ఇవి దివ్య చైతన్య స్థావరములు
2. మెడుల్లా, విశుద్ధ, అనాహత: పెద్దల సభ దివ్యమైన విచక్షణా శక్తుల నిలయము.
3. మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార: సామాన్యుల సభ, దిగువ సభ, చట్టమునకు లోబడి ప్రవర్తించు ఇంద్రియ శక్తుల స్థావరములు. (చట్టము అనగా పైన గల మూడు చక్రముల యందలి బుద్ధి, విచక్షణా శక్తి)
4. శరీర సామ్రాజ్య ప్రదేశములు: మూలాధారమందలి ప్రశాంతమైన పునరుత్పత్తి శక్తి మరియూ శరీరమందలి కండలు, ఎముకలు, మజ్జ ఇతర అవయవములు, నరములు, రక్తము, నాడులు, సిరలు, గ్రంధులు, చర్మము మొదలగునవి.
No comments:
Post a Comment