Thursday, May 16, 2024

1.1 శరీర సామ్రాజ్యము నందు ఆరోగ్యము, అందము, ప్రశాంతత

 



శరీర సామ్రాజ్యము నందు ఆరోగ్యము, అందము, ప్రశాంతత 

(HEALTH, BEAUTY, AND PEACE IN THE BODY KINGDOM)


రాజైన ఆత్మ పరిపాలన యందు శరీర సామ్రాజ్యము నందలి శరీర భాగములన్నియు చైతన్యవంతముగా వుండును. ఈ శరీర భాగములు మూలాధార స్థావరము, మరియూ శరీరమందలి కండర భాగములు, ఎముకలు, మజ్జ, ఇతర అవయవములు, నరములు, రక్తము, శుద్ధ రక్తనాళములు, సిరలు, గ్రంధులు, కండరములు, చర్మము మొదలగునవి. వీటన్నిటి యందు మూలాధార చక్రస్థావరము మిక్కిలి ప్రాముఖ్యమైనది. ఊర్ధ్వస్థానమున వున్న చక్ర స్థావరముల యందలి ప్రాణశక్తి చైతన్యము యొక్క సూక్ష్మ శక్తులు మూలాధార చక్రము ద్వారా భౌతిక శరీరముపై ప్రస్ఫుటమగును. దాని కారణముగా ప్రాణశక్తి మూలాధార చక్రము నుండి అధోముఖముగా శరీర బాహ్యమునకు వెలువడుటచే సృష్టి పదార్థము అయిదు వైవిధ్య రూపములుగా వ్యక్తమై, ఆ ప్రాణశక్తి శరీరమందలి ఘన, ద్రవ పదార్థములైన మాంసము, ఎముకలు, రక్తము మరియూ ఇతర అవయవములను నిర్మించి వాటిని పోషించునదై యుండును. (ఐదు చక్రస్థానముల యందలి పంచ భూత తరంగముల చర్య వలన ఘన, ద్రవ, వాయు, తేజస్సు, ఆకాశ రూపములుగా మనకు అగుపించును. ఆత్మ జ్ఞానము వలన శరీర భాగములు ఎముకలు, కండలవలె కాక పంచభూత తత్వములుగా తెలియును). రాజైన ఆత్మ యొక్క పరిపాలన యందు మూలాధార చక్ర స్థానమందలి సృష్టి కారక ప్రకృతి మాత ప్రశాంతముగా అదుపు నందుండి, శరీర సామ్రాజ్యమునకు ఆరోగ్యము, అందము, ప్రశాంతతను చేకూర్చును. యోగి యొక్క లోతైన ధ్యానము నందు అతని ఆజ్ఞానుసారము సృష్టి కారక శక్తులు వెనుకకు మరలి అంతర్ముఖముగా ప్రవహించి తమ స్వస్థానమైన వేయిదళ పద్మమును చేరును. ఈ ప్రక్రియ యందు ఆ శక్తి ప్రకాశవంతమైన దివ్య శక్తుల ప్రపంచమును మరియు ఆత్మ-పరమాత్మ చైతన్యమును యోగికి తెలియజేయును. మూలాధారము నుండి ఈ శక్తి ప్రవాహము పరమాత్మను చేరుటను యోగ శాస్త్రము నందు కుండలినీ శక్తి జాగరూకమగుట అని తెలుపుదురు. 

 శరీర సామ్రాజ్యము నందలి శరీర భాగములన్నియూ పది ఇంద్రియ యువరాజుల ఇంద్రియ శక్తుల ప్రభావమునకు లోబడీ యుండును. పది ఇంద్రియ యువరాజులు వారి వారి ఇంద్రియ ప్రదేశ భాగముల యందు వుండెదరు. అవి అయిదు విధములైన ఇంద్రియ జ్ఞానము అనగా - చూపు, వినికిడి, స్పర్శ వాసన, మరియూ రుచి, మరియూ అయిదు విధములైన కర్మేంద్రియ జ్ఞానము, అనగా - మాట్లాడు శక్తి, కాళ్ళ యందలి చలన శక్తి, చేతులయందలి నైపుణ్య శక్తి, ఆసనమందలి విసర్జన శక్తి మరియూ విసర్జనా కండరముల శక్తి, జననేంద్రియముల యందలి పునరుత్పత్తి శక్తి. 

 ఇంద్రియ యువరాజులు ఆత్మ యొక్క విచక్షణా శక్తులతో సామరస్య పూర్వక శక్తులతో ఏకీకృతమై ఉన్నతమైన స్థితి యందు ఉందురు. ఆత్మ మనిషి యందు శుద్ధచైతన్యముగా ఉద్భవించి, ఈ భౌతిక ప్రపంచము నందు మరియు పరబ్రహ్మకు చెందిన దివ్యలోకమునందు తనను వ్యక్తపరచుకొను క్రమమున ఇంద్రియములు ఆత్మకు ఉపకరణములై తమ నియమింత లక్ష్యములను నెరవేర్చును. 

శరీర సామ్రాజ్యము నందలి ప్రజలు రాజైన ఆత్మయొక్క అతని సలహాదారులైన వివేచనా, మానసిక ప్రవృత్తుల మరియూ ప్రధానమంత్రి యగు బుద్ధి యొక్క శుద్ధమైన ఇంద్రియ యువరాజుల అనుగ్రహము, వివేకముతో కూడిన మార్గ దర్శకత్వము నందు మిక్కిలి ప్రయోజనమును పొందెదరు. ఆలోచనా, సంకల్పము, అనుభూతి అను ప్రజలు వివేకవంతులై, క్రియాశీలురై, ప్రశాంతతతో సంతోషముగా వుంటారు. చైతన్యము కలిగిన వివేకవంతులైన కార్మికులు అనగా కణములు, అణువులు, పరమాణువులు, ఎలక్ట్రానులు, క్రియాశీలకమైన ప్రాణ శక్తి కణములు (లైఫ్ ట్రాన్స్) మరియు ఇతర జన సమూహము మిక్కిలి ప్రాముఖ్యతను కలిగి సామరస్యముతో పని చేయుచూ సమర్థులై ఉందురు. 

 ఆత్మ రాజుగా పరిపాలించునపుడు ఆరోగ్యమునకు చెందిన చట్టములు, మానసిక సమర్థత, ఆలోచనలకు చెందిన ఆధ్యాత్మిక శిక్షణ, సంకల్పము, అనుభూతులు, శరీర సామ్రాజ్యము నందలి నివాస జనులైన, వివేకవంతులైన కణములు అన్నియు ఉన్నతమైన జ్ఞానముచే నడిపింపబడును. దాని ఫలితముగా శరీర సామ్రాజ్యములో సంతోషము, ఆరోగ్యము, సంపద, ప్రశాంతత, విచక్షణ, సమర్థత, అతీంద్రియ మార్గదర్శకత్వము అంతటా వ్యాపించియుండును. అటువంటి స్థితి స్వచ్ఛమైన ప్రకాశముతో పరమానందముతో నిండియుండును. 




No comments:

Post a Comment

1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...