Thursday, March 28, 2024

1.1 ఆత్మ నివసించు ప్రదేశము

  

శరీర సామ్రాజ్య వ్యవస్థ - "ఆత్మ" నివసించు ప్రదేశము  

 మానవుని శారీరిక మానసిక నిర్మాణ వ్యవస్థ చక్కటి పరిపూర్ణతతో కూడియుండి అది భగవంతుని దివ్యమైన ఏర్పాటును (ప్రణాళికను) తనయందు కలిగియున్నది. మనిషి యందు భగవంతుని ప్రతిబింబము ఆత్మ రూపమున ఉన్నది.  పురుష వీర్యకణము - స్త్రీ అండము  రెండూ కలిసి ఒక జీవకణముగా ఏర్పడినప్పుడు, అదే సమయమున "ఆత్మ" సర్వ శక్తివంతమగు ప్రాణము మరియు  చైతన్యముగా ఒక వెలుగు రూపమున ఆ జీవకణము నందు ప్రవేశించును. శిశువు శరీర భాగములు పెరిగి వృద్ధి చెందుచుండగా, పైన తెలిపిన ప్రాణము మెడుల్లా యందు స్థితమై యుండును. మెడుల్లాను "ప్రాణశక్తి స్థావరము" అందురు. కావున మెడుల్లాను "ప్రాణశక్తికి మార్గము" అని చెప్పుదురు. ఎందుకనగా రాజైన ఆత్మ ఈ మార్గము ద్వారా జయప్రదముగా శరీర సామ్రాజ్యము నందు ప్రవేశించును. ప్రాణశక్తి స్థిత స్థావరమున (seat of Life)  "ఆత్మ" యొక్క సూక్ష్మమైన జ్ఞానము మొట్టమొదటి  సారిగా తనను వ్యక్తపరచుకొనును. అట్టి జ్ఞానము నందు ఆ జీవి యొక్క కర్మానుసారము అతనికి రాబోవు జీవితము యొక్క  వివిధ దశలు ముద్రితమై యుండును. "ప్రాణము" లేక "ప్రజ్ఞ కలిగిన క్రియాశీలక ప్రాణశక్తి" (Intelligent Creative Life Force) యొక్క అద్భుతశక్తి వలన మరియు "ఆత్మ" యొక్క దిశానిర్దేశము మేరకు వీర్యకణము అండముతో కలిసిన సంయుక్త  బీజము (zygote) దశను దాటి ఆపై పిండరూప దశలను దాటి మానవ శరీర రూపమును పొందును. 

 సూక్ష్మ తత్వము (astral), కారణ తత్వము (causal) - ఆత్మ యొక్క ఉపకరణములు లేదా సృజనాత్మక శక్తులు.   ఆత్మ మొట్టమొదట ప్రాణకణము నందు ప్రవేశించునపుడు అది రెండు సూక్ష్మమైన శరీరపు పొరలను ధరించి యుండును. అందు  మొదటి శరీరము కారణ రూపు కలిగిన  THOUGHTRONS (ప్రాణకణికలు) చే ఏర్పడినది. దీని చుట్టూ సూక్ష్మ రూపు కలిగిన LIFETRONS తో  కూడిన "సూక్ష్మశరీరము" ఏర్పడియుండును.  సూక్ష్మ, స్థూల శరీరములు ఏర్పడుటకు కారణమైనది కనుక అది "కారణశరీరము" అని పిలువబడినది. కారణశరీరము  35 ఆలోచనా శక్తులను కలిగియుండును. వీటినుండి 19 మూల తత్వములచే సూక్ష్మ శరీరము, మరియు 16 స్థూల రసాయన తత్వములచే స్థూల శరీరము ఏర్పడును. 


సూక్ష్మ శరీరపు 19 మూల తత్వములు: 1. బుద్ధి (intelligence), 2. అహంకారం (ego), 3. చిత్తము (feeling), 4. మనస్సు (mind), 5. చూచుట, వినుట, వినుట, రుచి, వాసన, స్పర్శ అనబడు అయిదు పంచేంద్రియ జ్ఞానములు 6. పునరుత్పత్తి, విసర్జన, మాట్లాడు, నడచు, శారీరిక పరిశ్రమ చేయగలుగు మానసిక శక్తులైనా ఐదు కర్మేంద్రియ జ్ఞానములు, 7. పంచ ప్రాణములు - ఐదు ప్రాణ ఉపకరణములు - అది 

1. Crystalizing power -  శరీర స్థిరత్వము, పెరుగుదల , 

2. Assimilation - అనగా జీర్ణక్రియ  

3. Elimination   అనగా విసర్జన

4. Metabolising - జీవప్రక్రియ అనగా జీర్ణమైన ఆహారమును శక్తి రూపమున ఇతర శరీర భాగాలకు సమానముగా పంచుట  

5. Circulation అనగా ప్రసరణ. ఇది భౌతిక శరీర కార్యకలాపాలకు చెందినది. 

 సూక్ష్మ శరీరము నందలి 19 తత్వములు స్థూల శరీరమును నిర్మించి,  పోషించి,  దానికి జీవమును కల్పించును. సూక్ష్మ శరీరమునకు చెందిన మెదడు (కాంతి తో కూడిన వేయిదళ పద్మము), మరియూ వెన్నెముక (సూక్ష్మ శరీరము యొక్క వెన్నెముకను సుషుమ్న అందురు) మరియూ వాటికి చెందిన ఆరు చక్ర స్థానముల నుండి ఈ 19 తత్వములు పనిచేయును. స్థూల శరీర పరముగా ఈ చక్రస్థానములు మెడుల్లా  యందు మరియు వెన్నెముక యందలి 5 స్థావరములైన 

1. గొంతుక వెనుకనున్న విశుద్ధ, 

2. హృదయమునకు ఎదురుగా వున్న అనాహత, 

3. నాభికి ఎదురుగా వున్న మణిపూర, 

4. జనేంద్రియములకు ఎదురుగా నున్న స్వాధిష్ఠాన, 

5. వెన్నెముక మూలమున వున్న మూలాధార గా వున్నవి. 

 మనస్సు యొక్క స్థూలమైన శక్తులు స్థూల శరీర భాగములపై వ్యక్తమగును. కానీ ఆత్మ యొక్క సూక్ష్మమైన శక్తులు అనగా మనో చైతన్యము, బుద్ధి, సంకల్పము, చిత్తము - ఇవి మెడుల్లా మరియూ మెదడు యొక్క సున్నితమైన కణజాలము నందు వుండి అచట నుండి వాటి ద్వారా (అనగా మెదడు, మెడుల్లా ద్వారా)  వ్యక్తమగును.



Monday, March 25, 2024

1.1 గీతా సారము

 1.1  ప్రతి రోజు రాత్రి ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన ఆవశ్యకత 

 భగవద్గీత మొట్టమొదటి శ్లోకము నందే ప్రతి వ్యక్తీ ప్రతి రాత్రి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అతి ముఖ్యమైన ఆవశ్యకతను ఎత్తి చూపుతున్నది. దాని మూలమున వ్యక్తి తనయందలి ఏవిధమైన శక్తి (మంచి లేక చెడు శక్తి) ఆ రోజు యుద్ధమున గెలిచినది అతనికి  స్పష్టముగా  అర్థమగును. భగవంతుని ప్రణాళికతో సామరస్య పూరితముగా జీవించదలచిన వ్యక్తి ప్రతి రాత్రి అన్ని కాలములకు ఉపయుక్తమగు ప్రశ్నతో తనను తాను ప్రశ్నించుకొనవలెను. ఆ ప్రశ్న: మంచి, చెడు కర్మలు చేయబడు శరీర ప్రాంతము నందు గుమికూడిన నా యందలి భిన్న ప్రవృతులు ఏమి చేసినవి? నిరంతరము సాగు ఈ పోరాటము నందు ఏ శక్తి ఈ రోజు గెలిచినది? కుటిలమైఅన ప్రలోభమును కల్పించు చెడు ప్రవృత్తులు మరియు వాటికి వ్యతిరేకమైన స్వీయ క్రమశిక్షణ మరియు బుద్ధి - నాకు ఇప్పుడు తెలియజేయవలసినది.

వారేమి చేసిరి?

 యోగి మనస్సును కేంద్రీకరించి ధ్యానము చేసిన పిదప తన ఆత్మ శోధనా శక్తిని ఈ విధముగా ప్రశ్నించెను: "మెదడు, వెన్నెముక యందలి చైతన్య స్థావరముల యందున్న ఆత్మ యొక్క సంతానమైన బుద్ధి, దాని ప్రవృత్తులు తమ రాజ్యమును తిరిగి పొందుటకై శరీరేంద్రియ కార్య కలాప క్షేత్రము నందున్న మానసిక ఇంద్రియ శక్తులు చైతన్యమును బాహ్యమునకు లాగు ప్రయత్నమున, ఈ రెండు శక్తులు యుద్ధము చేయుట యందు ఆసక్తిని కలిగి అవి ఏమి చేసినవి? ఈ రోజు ఎవరు గెలిచిరి?

 సాధారణ మానవుడు  యుద్ధము  నందు   తగిలిన గాయపు చిహ్నములను కలిగియుండి మిక్కిలి వేధింపబడిన యోధుని వలె, ఆ యుద్ధములను చేయు విధములను అన్నిటినీ తెలిసియుండును. ఆ యుద్ధభూమిని అర్థము చేసుకొనుట యందు శత్రుసైన్యము  యొక్క దాడి వెనుకనున్న శాస్త్రీయతను అర్థము చేసుకొనుట యందు అతనికి గల శిక్షణ కొరవడినదై యుండును. అతను ఆ యుద్ధమును చేయగలుగు జ్ఞానమును సంపూర్ణముగా కలిగి యుండిన యెడల అతని విజయావకాశములు మరింత మెరుగుపడి అతనికి దిగ్భ్రమను కలిగించు ఓటములు తగ్గిపోవును.

కురుక్షేత్ర యుద్ధమునకు గల కారణములను చారిత్రాత్మకముగా పరిశీలించిన యెడల పాండుపుత్రులు తమ రాజ్యమును ధర్మయుతముగా పరిపాలించు సమయమున, ధృతరాష్ట్ర మహారాజు పుత్రుడైన , దుష్టుడైన దుర్యోధనుడు మాయోపాయముచే పాండవుల రాజ్యమును అపహరించి, వారిని దేశబహిష్కరణ గావించెనని తెలియుచున్నది.  

 సూచనాత్మకముగా, శరీరమను రాజ్యము "ఆత్మ" అను రాజునకు మరియు అతని సంతానమైన సద్గుణ ప్రవృత్తులకు న్యాయ సమ్మతముగా చెందినది. కానీ అహము మరియు దుష్టులైన, నీచులైన అతని సంతాన ప్రవృత్తి మోసపూరితముగా ఆత్మ యొక్క రాజ్యమును కాజేసిరి. "ఆత్మ" అను రాజు తన సామ్రాజ్యమును తిరిగి పొందుటకు ప్రయత్నించునపుడు శరీరము, మనస్సు యుద్ధభూమిగా మారును. "ఆత్మ" యను రాజు శరీర సామ్రాజ్యమును పరిపాలించు విధానము, అతడు దానిని కోల్పోయి మరలా దానిని గెలుచుకొను విధానమును తెలుపునదే "గీతా సారము".      

 

Saturday, March 23, 2024

1.1 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము

 

PAGE 7

EXPANDED COMMENTARY: THE BATTLE OF LIFE

 జీవన సంగ్రామము: విపులమైన వ్యాఖ్యానము 

ఒక వ్యక్తి తన తల్లి గర్భము నందు జీవము పొందినది మొదలు, అతడు చివరి శ్వాస ను విడచునంత వరకు అతను తన ప్రతి జన్మ యందు అనేక విధములైన సంఘర్షణలను - జీవ సంబంధమైనవి, వంశపారంపర్యమైనవి, సూక్ష్మ క్రిమి సంబంధమైనవి, సాంఘిక పరమైనవి, నైతిక పరమైనవి, రాజకీయ పరమైనవి, సామాజిక ప్రమైనవి, మానసిక పరమైనవి, అధిభౌతికమైనవి - అనేక విధములైన బాహ్య పరమైన, అంతర్గతమైన సంఘర్షణలను ఎదుర్కొనును. ప్రతి సంఘర్షణ యందు మంచి - చెడు శక్తులు తమ విజయమునకై పోరాడుచుండును. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మానవుడు ఈ పోరాటము నందు తన ప్రయత్నములు అన్నిటినీ ధర్మముతో అనుసంధానమగు విధముగ యత్నించవలెను. అంతిమమైన లక్ష్యము ఏమనగా ఆత్మ సాక్షాత్కారము - ప్రతి మనిషి యందున్న ఆత్మను అతను కనుగొనుటయే! ఆత్మ భగవంతుని ప్రతిబింబము మరియు శాశ్వతమైన, నిత్య జాగరూకమైన, నిత్య నూతన ఆనందమైన పరబ్రహ్మతో ఏకత్వము కలిగినది. 

 ప్రతిజన్మ యందు ఆత్మ మొట్ట మొదటగా, పునర్జన్మను పొందగోరు ఇతర ఆత్మల నుండి పోటీని ఎదుర్కొనును. ఒక నూతన మానవ దేహము ఏర్పడు ప్రక్రియ యందు పురుషుని వీర్యకణము, స్త్రీ అండము - రెండును కలసినపుడు, జన్మ జన్మకు నడుమ ఆత్మలు నివసించునట్టి దివ్య లోకమునందు మెరుపు వంటి ఒక్క వెలుగు మెరియును. ఆ వెలుగు,  ఒక ఆత్మ - అది మునుపటి జన్మల యందు తాను సముపార్జించుకొనిన కర్మలకు అనుగుణమగు ఒక పద్ధతి క్రమమును ప్రసరింప జేయగా, దానికి అనుగుణమైన ఆత్మ ఆ వెలుగునకు ఆకర్షింపబడును. అది గత జన్మల యందు తానుగ చేసుకొనిన కర్మల ప్రభావము. ప్రతి జన్మ యందు "కర్మ" యనునది పాక్షికముగ దానికి అనుగుణముగ వంశ పారంపర్య శక్తులతో తానుగ సమకూడును. ఒక శిశువు యొక్క ఆత్మ ఆ ప్రకారముగ తన పూర్వ జన్మపు కర్మలకు అనుగుణమైన వంశపారంపర్య కుటుంబమునకు ఆకర్షింపబడును. తల్లి గర్భము నందు జీవము నింపుకొనిన ఆ ఒక్క కణము నందు ప్రవేశించుటకు  అనేక ఆత్మలు పోటీ పడును. వాటి యందు ఒక్క ఆత్మ మాత్రమే విజయము పొందును (తల్లి ఒకరి కన్న ఎక్కువ మందిని గర్భమున ధరించినపుడు, ప్రాథమిక కణములు కూడ గర్భమున ఒకటి కన్న ఎక్కువ యుండును) . 

 తల్లి గర్భమున ఎదుగుచున్న శిశువు వ్యాధులతో, చీకటితో పోరాడుచు, పరిమితమునకు బంధింపబడి యుండును. అప్పుడప్పుడూ తన దివ్యత్వమును గుర్తుకు తెచ్చుకొనుచుండును. ఎదుగుచున్న శిశువు నందలి ఆత్మ, తాను ప్రస్తుతము నివసించుచున్న శరీరము యొక్క ఎదుగుదల, తన గత జన్మల కర్మలను, మంచి చెడుల ప్రభావమును అనుసరించి యుండుటను గమనించి దానితో సంతృప్తి చెంది యుండును. దీనికి అదనముగ అది  బాహ్య ప్రపంచము నుండి తనకెదురగు ప్రభావమును ఎదుర్కొనుచుండును. ఆ ప్రభావములు తన పరిసరముల వలన, తల్లి చేయు కర్మల వలన, బాహ్యమైన శబ్దములు, తల్లి యొక్క భావనల వలన, తల్లి అనుభవించు ప్రేమ, ద్వేషపు తరంగముల వలన, తల్లి యొక్క ప్రశాంతత మరియు కోపముల వలన ఏర్పడుచుండును.   శిశువు జన్మను పొందిన పిదప అది సహజముగ తన సుఖమును కోరి, జీవించి యుండవలెనను సహజమైన స్వభావమును కలిగియుండి, దానికి వ్యతిరేకముగ తన పూర్తి ఎదుగుదల లేని శరీరముతో పెనుగులాడు చుండును.

 ఎదుగుచున్న బాలుడు తనకు ఎరుక గలిగిన స్పృహతో దిశానిర్దేశము లేని ఆట పాటల కోరికలతో సమయము గడుపుచూ ఆపై విద్యను అభ్యసించి విద్యకు చెందిన ఒక క్రమబద్ధమైన శిక్షణను పొంది జీవితమున పెనుగులాడును. క్రమముగా జీవితమున ఇతనికి మరిన్ని తీవ్రమైన సంఘర్షణలు ఎదురగును. అవి అతని కర్మ ప్రవృత్తి ప్రభావమున అతని లోని స్వభావము నుండి లేక, బాహ్యమైన పరిసర ప్రభావము వలన మరియూ చెడు సహవాసము వలన ఏర్పడు సంఘర్షణలు. 

 యవ్వనము నందు వ్యక్తి తను ఎదురుచూడనటు వంటి అనేక సమస్యలను అకస్మాత్తుగా ఎదుర్కొన వలసి వచ్చినదని గ్రహించును -- అవి లైంగిక వాంచలు, ధనమును సులువుగా అధర్మ మార్గమున సంపాదించుట, తన సహచరులనుండీ ఎదురగు వత్తిడి, సమాజము యొక్క ప్రభావము మొదలగునవి. యవ్వనమున అడుగిడిన వారు తమను దండెత్తుచున్న ప్రాపంచిక సమస్యల సైన్యమును ఎదుర్కొనుటకు తమ చెంత "జ్ఞానము" అను ఖడ్గము లేదని గ్రహింతురు. 

వయోజనులు (adults) తమ యందు సహజముగా వున్న జ్ఞానమునూ, ఆధ్యాత్మిక విచక్షణను అభివృద్ధి పరచుకొనుటను తెలియక దానిని ఉపయోగించుట తెలియక తమ శరీర సామ్రాజ్యము మిక్కిలి కృరముగా అదుపు చేయలేని విధముగా కష్టములను కలిగించు చెడు కోరికల యొక్క, విధ్వంసకర అలవాట్ల యొక్క, వైఫల్యముల యొక్క, అజ్ఞానము యొక్క, కోరికల యొక్క విషాదము యొక్క తిరుగుబాతుదారులచే ఆక్రమింపబడినదని తెలిసికొందురు. 

 కొంతమంది వ్యక్తులు మాత్రము తమ శరీర సామ్రాజ్యము నందు ఒక నిరంతర సంగ్రామము జరుగుచున్నదని గ్రహించి యుందురు. కానీ, సాధారణముగా పూర్తి విధ్వంసము సంభవించిన పిదపనే వ్యక్తులు తమ జీవితములు నాశనము గావింపబడినవని గ్రహింతురు. మనిషి విజయము వైపు ముందుకు సాగుటకు ఆరోగ్యమునకు, శ్రేయస్సునకు, ఆత్మ నిగ్రహమునకు మరియూ జ్ఞానమునకు దినదినమూ నూతనముగా ప్రారంభించి ఆత్మ సామ్రాజ్య ప్రాంతమును ఆక్రమించిన తిరుగుబాటుదారులైన అజ్ఞానము నుండి ఒక్కొక్క అంగుళముగా చేజిక్కించుకొనవలెను. ప్రతి రోజూ కొంచెము కొంచెముగా మంచి వైపు పయనించాలి. 

 జాగరూకుడగు యోగి, సాధారణ మానవులు ఎదుర్కొను బాహ్యమైన యుద్ధముతో పాటూ, తన అంతరంగము నందు మరొక యుద్ధమును ఎదుర్కొనును. అది ఒక వైపు ప్రతికూలశక్తులైన చంచలత్వమునకు ( మనస్సు వలన కలుగునవి - ) మరియూ మరొకవైపు ధ్యానము చేయవలెను అను అనుకూలమైన ప్రయత్నము/కోరికకు మధ్యన జరుగు యుద్ధము. యోగి ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము నందు తానుగా తిరిగి స్థిర పడుటకు ప్రయత్నించు సందర్భమున జరుగును. ఆత్మ యొక్క అంతరంగ ఆధ్యాత్మిక సామ్రాజ్యము ఏదనగా - వెన్నూ, వెన్నెముక, మెదడూ నందలి ప్రాణశక్తి, దివ్యచైతన్యమునకు చెందిన సూక్ష్మ చక్ర స్థానములు. 


000000000000




Friday, March 22, 2024

1.1 కురుక్షేత్రము, సంజయుని ప్రతీకాత్మకత

  


ఈ కలహమాడు శక్తుల  (mind and wisdom -   మనస్సు మరియు బుద్ధీ ) యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము. "కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, "క్షేత్ర" అనగా భూమి. భౌతిక, మానసిక, ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరీరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియూ శరీరము అనబడు ఆ క్షేత్రముననే జరుగును. భగవద్గీత యందలి ఈ శ్లోకమున ఈ శరీరము "ధర్మక్షేత్రము"  అని పిలువబడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనద్, అందుచేతనే పవిత్ర క్షేత్రముగా చెప్పబడినది). ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి ( అనగా పాండుపుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్య కలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) ఈ క్షేత్రము నందే ధర్మ సంగ్రామము జరుగనున్నది. 

 PAGE 6

సంజయుని సూచనాత్మకత/ప్రతీకాత్మకత: 

నిష్పక్షపాతమైన అతీంద్రియ అంతఃపరిశీలన

"సంజయ" శబ్దార్థము "సంపూర్ణముగ జయించిన; తనను తాను జయించిన వాడు". స్వార్థ పూరిత బుద్ధి లేనివాడు మాత్రమే నిష్పక్షపాతముతో తనకు తాను పరిశీలించుకొను శక్తి సామర్థ్యమును కలిగి యుండును. ఆ విధముగ భగవద్గీత యందు సంజయుడు ఒక "దివ్యమైన అంతర్దృష్టి" యనబడు వాడు. సాధనాపేక్ష గల సాధకునికి సంజయుడు "నిష్పక్షపాత అతీంద్రియ స్వయం పరిశీలన" "వివేకవంతమైన ఆత్మ పరిశీలన". అది తనను తాను వ్యక్తిగతముగా వేరు వ్యక్తి యని భావించి పక్షపాతరహితముగా పరిశీలించుకొను శక్తి, మరియు ఖచ్చితముగ విమర్శించుకొను సమర్థత.  వ్యక్తికి తనకు తెలియకనే తన యందు ఆలోచనలు కలుగుచుండును. ఆత్మ పరిశీలన యనగా అంతర్ దృష్టి శక్తిచే మనస్సు తన ఆలోచనలను తానే పరిశీలించుకొను శక్తి.    అది బుద్ధిని ఉపయోగించి తర్కింపక, తానుగా అనుభూతి చెంది తెలిసికొనుట - అది భావోద్వేగపు పక్షపాతముతో కాదు. సుస్పష్టమైన ప్రశాంతమైన అంతర్ దృష్టి తో తెలిసికొనుట.  

 మహా భారతము నందు భగవద్గీత ఒక అంతర్భాగ అంశము. వేదవ్యాసుడు సంజయునికి యుద్ధ భూమి యందు జరుగు సర్వము సుదూరము నుండి చూడగలుగు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించెను. ఆ శక్తి వలన సంజయుడు అంధుడైన ధృతరాష్ట్ర మహారాజునకు యుద్ధమున జరుగు విషయములను వివరింపగలిగెను. సంజయుని అట్టి వివరణ యందలి భాగముగ వేదవ్యాసుడు భగవద్గీతను మహాభారతమున ఒక అంశముగ లిఖించెను. కావున భగవద్గీత యందలి మొదటి శ్లోకమున ధృతరాష్ట్రుని ప్రశ్న వర్తమాన కాలమునకు చెందియుండవలెనని ఎవ్వరైననూ భావింతురు. అచ్చట వ్యాసుడు ఉద్దేశ్యపూర్వకముగా "ఏమి చేసిరి" అను క్రియను భూతకాలమునకు చెందినదిగా లిఖించెను.   

 వివేకవంతుడైన విద్యార్థికి ఇది ఒక స్పష్టమైన సూచన. ఆ సూచన ఏదనగా - భగవద్గీత ఉత్తర భారత దేశము నందలి కురుక్షేత్రమున జరిగిన చారిత్రాత్మక యుద్ధమును సందర్భవశముగా ప్రస్తావించు చున్నది. వ్యాసుడు ప్రధానముగ మానవుని దైనందిన జీవితమున జరుగు ఒక సర్వ సామాన్యమైన యుద్ధము యొక్క గతిని లిఖించ దలచినచో, అతను ధృతరాష్ట్రుని తో సంజయుని ఉద్దేశించి వర్తమాన కాల క్రియను ఉపయోగించి " నా పుత్రులు మరియూ పాండు పుత్రులు - వారిపుడు ఏమి చేయుచున్నారు?" అని ప్రశ్నింప జేసి యుండును.  

 ఇది మిక్కిలి ముఖ్యమైన అంశము. భగవద్గీత యందలి కాలమునకు అతీతమైన సందేశము ఒక చారిత్రాత్మకమైన యుద్ధమునకు మాత్రమే సంబంధించినది కాదు. అది విశ్వము నందు మంచికి - చెడుకు మధ్య జరుగు సంఘర్షణను సూచించునది. అంతియే గాక అది పరమాత్మకు - ప్రకృతికి, ఆత్మకు - శరీరమునకు, జీవితమునకు - మరణమునకు, ఆరోగ్యమునకు - అనారోగ్యమునకు, విజ్ఞానమునకు - అజ్ఞానమునకు, శాశ్వతత్వమునకు - అశాశ్వతత్వమునకు, ఆత్మ నిగ్రహమునకు - ప్రలోభమునకు, బుద్ధికీ - గ్రుడ్డిదైన ఇంద్రియ మనస్సుకు మధ్యన జీవితమున నిరంతరము జరుగు సంఘర్షణను సూచించును. మొదటి శ్లోకము నందు "ఏమి చేసిరి" అని ధృతరాష్ట్రుడు అడుగుట యందు భూతకాల క్రియను వ్యాసుడు ఉపయోగించి, ఒక వ్యక్తి తన మనస్సు నందు ఆ రోజు జరిగిన  సంఘర్షణలను ఆత్మ పరిశీలనా శక్తి ని ఉపయోగించి పునస్సమీక్షించుకొని, ఆ రోజు అనుకూలమైన ఫలితములు సంభవించెనా లేక ప్రతికూల ఫలితములు సంభవించెనా యను వానిని నిర్ణయించుకొనుటను వ్యక్తపరచు చున్నవి. 


000000000

sanjaya, dhritarashtra, mind, wisdom

Tuesday, March 19, 2024

1.1 మొదటి శ్లోకము వ్యాఖ్య - రెండు వ్యతిరేక శక్తులు

 

రెండు వ్యతిరేక శక్తులు:

అధమ స్థాయికి చెందిన మనస్సు యొక్క ప్రవృత్తులు Vs ఆత్మ యొక్క విచక్షణా శక్తి - బుద్ధి

ఈ క్షేత్రమునందు పోరాడు రెండు వ్యతిరేక శక్తులు, లేక రెండు అయస్కాంత ధృవములు ఏవనగా 1. విచక్షణతో కూడిన తెలివి (బుద్ధి) మరియు 2. ఇంద్రియాసక్తి కలిగిన మనస్సు.                 "బుద్ధి" అను శుద్ధమైన విచక్షణా శక్తి కి దృష్టాంతముగా "పాండు రాజు" సూచింపబడెను. అతడు కుంతీదేవి భర్త. కుంతీదేవి అర్జునుని మరియు ఇతర సోదర పాండవుల తల్లి. "పాండవులు" నివృత్తి ధర్మ సూత్రములు అనబడు ప్రాపంచిక విషయముల పరిత్యాగమును అనుసరించువారు. "పాండు" నామము "పండా" అను శబ్దము నుండి వెలువడినది. దీని అర్థము "తెలుపు". ఇది శుద్ధమైన బుద్ధి యొక్క స్పష్టతకు దృష్టాంతము. "మనస్సు"కు దృష్టాంతముగా గ్రుడ్డి "ధృతరాష్ట్ర" మహారాజు సూచింపబడెను. అతడు నూరుగురు కౌరవుల తండ్రి. కౌరవులు అనగా శరీరము నందలి ఇంద్రియ భావ ప్రవృత్తులు - ప్రాపంచిక ఆనంద ప్రవృత్తిని కలిగిన వారు.

                "బుద్ధి" తన వివేచనను ఆత్మ కు చెందిన "అధిచేతన" (super consciousness) నుండి గ్రహించును. "ఆత్మ" కారణ శరీరమునకు చెందిన సూక్ష్మ మైన ఆధ్యాత్మిక మెదడు, వెన్నెముక స్థావరముల యందు గల చైతన్యము నందు స్థితమై యుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు ఒక సూక్ష్మమైన అయస్కాంత ధృవము వంటిది. ఇది భౌతిక ప్రపంచము వైపు బహిర్ముఖమై యుండును. ఇది భౌతిక శరీరపు మెదడునందు "పాన్స్ వరోలి" (Pons Varoli) అను ప్రాంతము నందుండి ఎల్లపుడూ శరీరమందలి ఇంద్రియములను సమన్వయ పరచు చుండును. ఆ విధముగా నున్న బుద్ధి, చైతన్యమును సత్యమైన దానివైపు అనగా "ఆత్మ సాక్షాత్కారము" వైపు లాగుచుండును. ఇంద్రియములతో కూడిన మనస్సు చైతన్యమును సత్యము నుండి మరల్చి, దానిని శరీరమునకు చెందిన బాహ్యమైన ఇంద్రియ కార్యకలాపముల వైపు లాగుచుండును. ఆ విధముగా మనస్సు భ్రాంతి మయ ప్రాపంచిక ద్వంద్వములగు మాయకు చెందినదై యుండును.

"ధృతరాష్ట్ర" అను నామము "ధృత" అను మూలము నుండి వెలువడింది. దీని భావము - పట్టి ఉంచిన, ఆధారపడిన, గట్టిగా లాగి ఉంచు". "రాష్ట్ర" అనగా "రాజ్యము, రాజ అనగా పాలించు" అని భావము. దృష్టాంత పరముగా దీని భావము - ధృతం రాష్ట్రం ఏన - అనగా ఇంద్రియ రాజ్యమును ధృఢముగా పట్టుకుని రాజ్యమేలువాడు అని అర్థము. రథమునకున్న గుర్రములను కళ్ళెములు ఒకటిగా జతపరచి ఉంచు విధముగా "మనస్సు" ఇంద్రియాలను సమన్వయ పరుస్తుంది. శరీరము - రథము, ఆత్మ - ఆ రథము యొక్క యజమాని; తెలివి - సరథి; ఇంద్రియములు గుర్రములు. మైండ్/మనస్సు గుడ్డిదని చెప్పబడింది. కళ్ళెములు గుర్రముల నుండి ప్రేరణను రథ సారథి కి, రథ సారథి యొక్క మార్గదర్శకత్వమును గుర్రములకు అందజేయును. అదే విధముగా గ్రుడ్డి మనస్సు తానుగా జూచి గ్రహింపజాలదు. మరియు తానుగా సూచనలను ఇవ్వ జాలదు. కానీ అది ఇంద్రియముల నుండి భావములను గ్రహించి "తెలివి" ఇచ్చిన తీర్పునూ, సూచనలనూ ఇంద్రియములకు అందించును. తెలివిని "బుద్ధి" అనగా శుద్ధమైన విచక్షణా శక్తి నిర్దేశించినచో ఇంద్రియాలు అదుపులో వుంటాయి. తెలివిని ప్రాపంచిక కోరికలు నిర్దేశించినచో ఇంద్రియములు విశృంఖలతతో అదుపు తప్పును.




GOD TALKS WITH ARJUNA మొదటి శ్లోకము వ్యాఖ్య 1



  మొదటి శ్లోకము - 1వ విభాగము

"వారు ఏమి చేసిరి?" - మానసిక, ఆధ్యాత్మిక రణరంగ పరిశీలన 

  1వ శ్లోకము 

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ|| 

ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికెను

"పవిత్రమైన కురుక్షేత్ర రంగమందు (ధర్మక్షేత్రము-కురుక్షేత్రము) నా పుత్రులూ మరియూ పాండు పుత్రులు ఒక చోట చేరి, యుద్ధ కాంక్ష గలవారై, వారేమి చేసిరి, ఓ సంజయా?"

గురూజి  చే ఇవ్వబడిన పద అర్థము: అంధుడైన ధృతరాష్ట్ర మహా రాజు (అనగా గుడ్డి మనస్సు) నిజాయితీ పరుడైన సంజయుడిని (నిష్పక్షపాతము, అంతఃకరణ పరిశీలన) ఈ విధముగా ప్రశ్నించెను: "నా పుత్రులైన కౌరవులు (దుర్మార్గపు ఉద్రేకపూరితమైన మానసిక ఇంద్రియ ప్రవృత్తులు,  ధర్మపరులైన పాండవ పుత్రులు      ( శుద్ధమైన  బుద్ధి, విచక్షణా శక్తి గుణములు ) కురుక్షేత్రమందలి (కర్మలను చేయు శరీర క్షేత్రము) ధర్మక్షేత్రము నందు (పవిత్ర క్షేత్రమునందు ) - అంతరంగము, తన ఆధిపత్యమును నిలుపుకొనుటకై, యుద్ధమును చేయు కాంక్ష కలవారై అచటకు చేరగా అచట ఏమి జరిగినది?


ధృతరాష్టృని ప్రశ్న యందలి దృష్టాంత ప్రాముఖ్యత 

 ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతో సంజయుడిని కురుపాండవుల మధ్యన యుద్ధము, కురుక్షేత్రము నందు ఏవిధముగా జరిగినది అను దానిని పక్షపాత రహితముగా తెలుపమని అడుగగా- దృష్టాంత పరముగా ఒక ఆధ్యాత్మిక సాధకుడు తాను ఆత్మ సాక్షాత్కారమును గెలుచుటకై ధర్మ బద్ధమైన యుద్ధమునకు చెందిన తన దినచర్యలను ప్రతి దినమూ పునః పరీక్షించుకుని తనను తాను ప్రశ్నించుకొనుటను సూచించు చున్నది.


నిజాయితీ  తో కూడిన ఆత్మ పరిశీలన ద్వారా సాధకుడు తన కార్యకలాపములను విశ్లేషించుకొని, తన యందలి ఒకదానినొకటి ఎదిరించు మంచి-చెడు గుణముల యొక్క బలమును నిర్థారించుకొనును. అనగా అంచనా వేయును; ఆత్మనిగ్రహమును ఎదిరించు ఇంద్రియ లోలత్వము; విచక్షణతో కూడిన తెలివిని వ్యతిరేకించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు; ధ్యానము నందలి ఆధ్యాత్మిక ధృఢ సంకల్పమును ఎదిరించు మానసిక ఇంద్రియ ప్రవృత్తులు, శారీరిక చంచలత్వము; దివ్యమైన ఆత్మ చైతన్యమునకు ప్రతికూలముగా అజ్ఞానము మరియు అయస్కాంత శక్తి వలె ఆకర్షించు అధమ స్థాయికి చెందిన అహము యొక్క ప్రవృత్తి - మున్నగు కలహమాడు శక్తుల యొక్క యుద్ధ భూమియే కురుక్షేత్రము.


("కురు" అను పదము యొక్క సంస్కృత ధాతువు "క్రి" నుండి ఏర్పడినది. దాని భావము పని లేక భౌతిక కర్మ, మరియు క్షేత్ర అనగా భూమి). భౌతిక మానసిక ఆత్మ శక్తులతో కలిసి యున్న ఈ శరమే కర్మలను చేయు క్షేత్రము. వ్యక్తి జీవితమున సంభవించు కర్మలన్నియు శరీరము అనబడు ఆక్షేత్రముననే జరుగును. భగవద్గీతయందలి ఈ శ్లోకమున ఈ శరీరమును ధర్మ క్షేత్రము అని పిలువ బడినది. (ధర్మము అనునది సద్గుణము మరియు పవిత్రమైనది. అందుచేతనే పవిత్ర క్షేత్రం గా చెప్పబడినది)

ఏలయనగా ఆత్మకు చెందిన విచక్షణతో కూడిన తెలివికి (అనగా పాండు పుత్రులకు) మరియు గుడ్డి మనసు యొక్క నీచమైన, అదుపులేని కార్యకలాపములకు (అనగా కౌరవులు - అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు పుత్రులు) మధ్యన ఈ క్షేత్రమునందే ధర్మ సంగ్రామము జరుగనున్నది. 


మరొక భావార్థము తో ధర్మ క్షేత్రము నిష్ఠతో కూడిన ఆధ్యాత్మిక విధులను మరియు ఆ విధమైన కార్యకలాపములను చేయు ప్రాంతమును సూచించును. (అనగా ధ్యానము నందు యోగి యొక్క కార్యకలాపములు). దానికి విరుద్ధముగా "కురుక్షేత్రము" - అనగా ప్రాపంచిక బాధ్యతలను సూచించును. ఆ విధముగా లోతైన దృష్టాంత భావమును పరికించిన యెడల "ధర్మక్షేత్రము-కురుక్షేత్రము" ఆత్మ సాక్షాత్కారమును సాధించుటకు యోగ-ధ్యానమునకు చెందిన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగు శరీరమందలి అంతః క్షేత్రమును సూచించును. ఆ అంతఃక్షేత్రమేదనగా దివ్య చైతన్యమును కలిగియున్న మెదడూ, వెన్నెముక యందలి ఏడు సూక్ష్మ చక్రస్థావరములు.





*****************************




 


GOD TALKS WITH ARJUNA

  

మొదటి అధ్యాయము

అర్జున విషాద యోగము

అధ్యాయము యొక్క ప్రాముఖ్యత

ప్రఖ్యాతి చెందిన భగవద్గీత యోగశాస్త్రమునకు చెందిన ఒక సర్వోత్కృష్టమైన ప్రమాణ గ్రంధము. అది మానవుడి విశాల దృక్పథ అన్వేషణను ఒక ఆచరణీయత్మక విధానము తోను, నిగూఢ తత్వము తోను బోధించుచున్నది. మానవ జాతి తరతరాలుగా ఈ ప్రియమైన భగవద్గీత అందించిన ఉపదేశముల యందు స్వాంతనను, ఆశ్రయమునూ పొందినది. భగవద్గీత సాధకుడు ఆచరణీయాత్మకముగా అనుసరింపవలసిన ఆధ్యాత్మిక సూత్రములను తెలుపుటయే గాక, అవి ఒక పరిపూర్ణ యోగి సాధించిన జ్ఞానమును వ్యక్తపరచు పరిపూర్ణ సూత్రములు అని కూడా తెలియుచున్నది. 

 ఆధునిక గ్రంధముల ఉపోద్ఘాతమందు, ఆ గ్రంధమందలి విషయముల యొక్క సంగ్రహ ప్రస్తావన గావింపబడును. కానీ భారతదేశపు ప్రాచీన కాల హైందవ గ్రంధ రచయితలు గ్రంధము నందలి మొదటి అధ్యాయము నందు వారి లక్ష్యమును వ్యక్త పరచెదరు. ఆ విధముగా భగవద్గీత యందలి మొదటి అధ్యాయము గ్రంధము నందు తరువాత ప్రస్తావించబడు పవిత్ర సంభాషణకు పరిచయ వాక్యముల వలె ఉండును. ఈ మొదటి అధ్యాయము రంగమును సిద్ధము చేసి దానికి తగిన నేపథ్యమును ఏర్పాటు చేయగా, అందలి విషయములకు ప్రాముఖ్యత లేదు అను ఒక తేలిక భావముతో ఈ గ్రంధమును అధ్యయనము చేయరాదు. ఈ గ్రంధమును అధ్యయనము చేయునపుడు దాని రచయిత సుప్రసిద్ధుడైన వ్యాస మహర్షి ఈ గ్రంధము నందు కల్పించిన అన్య విషయ సూచనను గుర్తించి చదువవలెను. అది యోగ శాస్త్రమునకు చెందిన ప్రాథమిక సూత్రములను తెలియ చేయును 

 మరియూ అది భగవంతునితో ఐక్యతను అనగా ముక్తి లేక కైవల్యమును సాధించు మార్గమును అనుసరించు యోగి తన సాధన ప్రారంభమున ఎదుర్కొను కష్టములను వివరించును. యోగ సాధన లక్ష్యము భగవంతునిలో ఐక్యత పొందుట. మొదటి అధ్యాయమునందు అంతర్నిహితము గావింపబడిన సత్యములను అర్థము చేసికొనుట అనగా : యోగ ప్రయాణము కొరకు చక్కగా ఏర్పాటు చేసిన వ్యవస్థ యందు పయనించుటయే. పూజ్యులైన నా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు సాక్షాత్ జ్ఞానావతారము. వారు మొదటి అధ్యయము నందలి కొన్ని ప్రముఖమైన శ్లోకముల యందు నిగూఢమై యున్న అర్థమును వెలికి తీయుటను నాకు నేర్పించిరి. వారు అప్పుడు ఈ విధముగా పలికిరి - "నీ వద్ద తాళము చెవి కలదు. నీ యందలి అంతరంగ ప్రశాంతతతో నీవు ఈ గ్రంథమందలి ఏ శ్లోకమునైననూ అవగాహన చేసుకొని, దాని విషయమునూ సారమునూ తెలుసుకొనగలవు." వారిచ్చిన ప్రోత్సాహముతో మరియూ వారి కృపతో నేను ఈ గ్రంథమును సమర్పించు చున్నాను. 




************************


1.1 Comparison of Senses Ruled by the Soul And as Ruled by Ego

  'ఆత్మ" పరిపాలన యందు - 'అహము' పరిపాలనయందు ఇంద్రియముల తారతమ్యము: 1. దృష్టి ప్రాంతము: దృష్టి ప్రాంతమునకు 'ఔన్నత్యపు దృష...